దోపిడీని దాచిపెట్టేందుకే ప్రత్యేక రైల్వే బడ్జెట్‌కు స్వస్తి : రాహుల్‌ గాంధీ

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ప్రధాని మోడీని విశ్వాసించడమంటే ద్రోహానికి గ్యారెంటీ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. దోపిడీని దాచిపెట్టేందుకే మోడీ ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా సమర్పించే సాంప్రదాయానికి స్వస్తి పలికి .. కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. కేవలం ధనికుల కోసమే మోడీ ప్రభుత్వం రైల్వే విధానాలను రూపొందిస్తోందని మండిపడ్డారు. ధనవంతులను మాత్రమే దృష్టిలో ఉంచుకుని రైల్వే విధానాలు రూపొందించడం.. రైల్వేపై ఆధారపడిన 80 శాతం మంది ప్రజలకు ద్రోహం చేయడమేనని దుయ్యబట్టారు. ‘హవాయి చెప్పులు’ ధరించిన వారిని ‘హవాయి జహాజ్‌ (విమానం)’ లో ప్రయాణించేలా చేయాలన్న కలను ప్రజలకు చూపిస్తూ.. ప్రధాని మోడీ వారిని ‘గరీబోంకి సవారీ’ (పేదల వాహనం) రైల్వేల నుండి దూరం చేస్తున్నారని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ” ప్రతి ఏడాది 10శాతం ఛార్జీలు పెంచడం, డైనమిక్‌ ఛార్జీల పేరుతో దోపిడీ, పెరుగుతున్న ఛార్జీల రద్దు, ఖరీదైన ప్లాట్‌ ఫారమ్‌ టిక్కెట్లతో పేదలు అడుగు కూడా వేయలేని ‘ఉన్నతవర్గం రైలు’ చిత్రాన్ని చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారు” అని పేర్కొన్నారు. సీనియర్‌ సిటిజన్లకు ఇచ్చిన మినహాయింపులను ‘అపహరించి ‘ గత మూడేళ్లలో ప్రభుత్వం వారి నుండి రూ.3,700 కోట్లు దోచుకుందని అన్నారు. ప్రచారం కోసం ఎంపిక చేసిన రైళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం సామాన్యుల రైళ్లను తగ్గిస్తున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రయాణికులకు రైల్వేల్లో ప్రాధాన్యత లేకుండా పోయిందని అన్నారు. ఎసి కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు జనరల్‌ కోచ్‌ల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఎసి కోచ్‌లను మూడు రెట్లు పెంచారని అన్నారు. కూలీలు, రైతులే కాకుండా విద్యార్థులు, సర్వీస్‌ క్లాస్‌ ప్రజలు కూడా జనరల్‌ కోచ్‌లలో ప్రయాణిస్తున్నారు.

Spread the love