18వ తేదీన తెలంగాణకు రాహుల్ గాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఎలాగైనా కర్ణాటక ఫలితాలు రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇప్పుడు ఈ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడింది. ఇందుకోసం 119 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీని ద్వారా ఇప్పటివరకు ప్రకటించిన యువ డెక్లరేషన్, వ్యవసాయ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, చేయూత పెన్షన్ పథకం, 6 హామీల గ్యారెంటీ కార్డు జనంలోకి తీసుకెళ్లనున్నారు. రోజుకు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాలలో బస్సు యాత్ర చేపట్టేందుకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. కార్నర్ సమావేశాలు నిర్వహణకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గేలతోపాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెయినర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. ఈ నెల 14, 15 తేదీలలో ప్రియాంక గాంధీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Spread the love