చిన్నారుల మరణం కలచివేసింది: రాహుల్ గాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్
గుజరాత్ లోని గేమింగ్ జోన్ లో, అదేవిధంగా ఢిల్లీలోని ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముక్కుపచ్చలారని చిన్నారులు చనిపోవడం తనను కలచివేసిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలంటూ రాహుల్ ఆకాంక్షించారు. ఈ అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా సహాయ కార్యక్రమాల్లో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలను అభ్యర్థించారు. రాజ్ కోట్ లోని ఓ గేమింగ్ జోన్ లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ మంటల్లో తొమ్మిది మంది చిన్నారులు సహా మొత్తం 32 మంది అగ్నికి ఆహుతయ్యారు. అర్ధరాత్రి ప్రాంతంలో ఢిల్లీలోని వివేక్ విహార్ న్యూబోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ప్రమాదాలపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ట్విట్టర్ లో స్పందించారు.

Spread the love