– హామీలపై ప్రజలు నిలదీస్తారని భయం : కల్వకుంంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హామీలపై ప్రజలు నిలదీస్తారని భయపడ్డ రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనకు రాలేక పారిపోయారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకిచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మార్చి 8న మహిళా శంఖారావం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ప్రకటించారనీ, అది అమలు కానందునే మళ్లీ వచ్చేందుకు రాహుల్ గాంధీ భయపడ్డారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నాయకులను చూసి కాకుండా రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీలను చూసి ప్రజలు ఓట్లేసినట్టు చెబుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు ఒక్కో మహిళకు నెలకు రూ.2,500 చొప్పున 14 నెలలకు రూ.35 వేలు బాకీ పడిందని తెలిపారు. కేసీఆర్ కిట్ల పంపిణీని ఆపేసిందనీ, మానవత్వం లేకుండా రేవంత్ సర్కార్ పాలన చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై శ్రద్ధ పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు భద్రత లేని పరిస్థితి దాపురించిందనీ, రేవంత్ రెడ్డి పాలనలో నేరాల రేటు 20 శాతం పెరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తరచూ మతకల్లోలాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో 70 శాతం పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.