నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు సామాజిక సేవా కార్యక్రమాలు, పాలాభిషేకాలు, పాలు, పండ్లు పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, పెన్నుల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టారు. కేకులు కోసి సంబురాలు జరుపుకున్నారు. హైదరాబాద్ గాంధీభవన్, ఇందిరాభవన్‌లో ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహించారు. సీనియర్ నాయకులు వీహెచ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
జాంబాగ్ డివి జన్‌లో మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బలమూరి వెంకట్, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, కె.సుజాత తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, మాజీ.ఎమ్మెల్యే విష్ణు తదితరులు పాల్గొన్నారు. అలీ కేఫ్ చౌరస్తా నుంచి గోల్నాక వరకు హైదరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోతారోహిత్ ఆధ్వర్యంలో భారత్ జూడో యాత్ర నిర్వహించారు.