నవతెలంగాణ – హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా విజయం సాధించారు. దాంతో, ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడం తప్పనిసరి కావడంతో, ఆయన వాయనాడ్ ను వదులుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, వాయనాడ్ ప్రజలకు భావోద్వేగాలతో కూడిన లేఖ రాశారు. “ఐదేళ్ల కిందట నేను మిమ్మల్ని మొదటిసారి కలిశాను. అప్పుడు నేను మీకు పరిచయం లేదు. కానీ మీరు నన్ను నమ్మి నాకు ఆశ్రయం ఇచ్చారు… నా ఇల్లు, నా కుటుంబం మీరే అయ్యారు. నాకు అపారమైన ప్రేమను, ఆప్యాయతలను పంచారు. నేను వేధింపులకు గురైనప్పుడు మీ ప్రేమ నన్ను రక్షించింది. జూన్ 17న వాయనాడ్ ను వదులుకుంటున్నట్టు మీడియా ముందు నిలబడి ప్రకటిస్తున్నప్పుడు నేను కన్నీరు పెట్టుకోవడం మీరు చూసి ఉంటారు. బరువెక్కిన గుండెతో మీకు వీడ్కోలు పలుకుతున్నాను. అయితే ఇక్కడ మీకు ప్రాతినిధ్యం వహించేందుకు నా సోదరి ప్రియాంక సిద్ధంగా ఉన్నారు. నన్ను ఆదరించినట్టు నా సోదరిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీరు అవకాశం ఇస్తే ఓ అద్భుతమైన ఎంపీగా ఆమె మీకు సేవలు అందిస్తుంది. మీరు నాకు ఎప్పటికీ కుటుంబ సభ్యులే. మీలో ప్రతి ఒక్కరికీ నేను అండగా ఉంటాను” అంటూ రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.