‘ఇండియా’ ప్రధాని అభ్యర్థిపై రాహుల్‌ గాంధీ కీలక వ్యాక్యాలు

నవతెలంగాణ – ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాతే విపక్షాల కూటమి ‘ఇండియా’ తరఫున ప్రధానమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని రాహుల్‌ గాంధీ  పేర్కొన్నారు. ప్రస్తుతం తాము సైద్ధాంతికంగా పోరాడుతున్నామన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారు, వాటిని రక్షించే శక్తుల మధ్యే తాజా పోరు అని వెల్లడించారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రాహుల్‌ సమాధానమిచ్చారు. ‘‘2004 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ‘భారత్‌ వెలిగిపోతోందంటూ’ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. అప్పుడు కాషాయ పార్టీ ఓటమి చెంది కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. ఈ ఎన్నికలు ఏకపక్షం అంటూ బయట ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. విపక్షాల ‘ఇండియా’ కూటమి సైద్ధాంతిక పోరు చేస్తోంది. ఇందులో కూటమిదే విజయం. ఎన్నికల తర్వాతే ‘ఇండియా’ తరఫున ప్రధానమంత్రి ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం’’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Spread the love