పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట

పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట– బెంగుళూరు కోర్టు నుంచి బెయిల్‌
బెంగుళూరు : పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. ఆయనకు బెంగుళూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రధాన వార్తాపత్రికల్లో కాంగ్రెస్‌ పరువు నష్టం కలిగించే వార్తలు ప్రచురించిందని ఆరోపిస్తూ బీజేపీ కర్నాటక విభాగం కేసు వేసింది. ఈ కేసులో భాగంగా శుక్రవారం రాహుల్‌ కోర్టుకు హాజరయ్యారు. 2019-2023 కాలంలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో 40 శాతం కమీషన్‌ వసూలు చేసినట్టు ”40 శాతం కమీషన్‌ ప్రభుత్వం”గా అభివర్ణిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటనలు చేసిందని పేర్కొంటూ కమలం పార్టీ నేత కేశవప్రసాద్‌ జూన్‌ 2023లో పరువు నష్టం దావా వేశారు. వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ ‘రేటు కార్డులు’ పెట్టిందంటూ హస్తం పార్టీ పోస్టర్లు అతికించిందని, దీని వల్ల కమలం పార్టీయ పరువుకు భంగం కలిగిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై గతంలో విచారణ చేసిన బెంగుళూరు కోర్టు కర్నాటక ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు జూన్‌ 1న బెయిల్‌ మంజూరు చేసింది. వారితో పాటు నిందితుడిగా ఉన్న రాహుల్‌గాంధీ జూన్‌ 7న కోర్టులో హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల్లో భాగంగా శుక్రవారం కోర్టు ఎదుట హాజరయ్యారు.మరో కేసులో.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై 2018లో వేసిన పరువు నష్టం కేసును ప్రయాగ్‌రాజ్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు శుక్రవారం వాయిదా వేసింది. దీని విచారణ జూన్‌ 18న చేయనున్నారు. 2005లో జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో సీబీఐ స్పెషల్‌ కోర్టు షాను 2014లో విడుదల చేసింది.

Spread the love