రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌

రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌

– లోక్‌సభలో అనర్హత వేటు ఎత్తివేత
– నాలుగు నెలల తరువాత పార్లమెంట్‌కు…
– ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్‌ ఎంపీలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తిరిగి వయనాడ్‌ ఎంపీగా కొనసాగనున్నారు. ఎంపీగా ఆయన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘మోడీ ఇంటిపేరు’ కేసులో గుజరాత్‌ కోర్టు ఇచ్చిన రెండేండ్ల జైలుశిక్ష తీర్పు ఆగస్టు 4న సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాహుల్‌పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఎంపీగా కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు రాహుల్‌ గాంధీకి లోక్‌సభ సచివాలయం సమాచారం అందించింది. పార్లమెంట్‌ సభ్యత్వం పునరుద్ధరణ కాపీ ఇవ్వడంతో.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ దాదాపు నాలుగు నెలల తరువాత పార్లమెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం భవనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల ఎంపీలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పార్లమెంట్‌లోకి సాదరంగా ఆహ్వానం పలికారు. కాగా అవిశ్వాస తీర్మానంపై చర్చను రాహుల్‌ గాంధీ ప్రారంభించనున్నారు.
ప్రజాస్వామ్య విజయం
– టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడం ప్రజాస్వామిక విజయమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలిచితీరుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలకుల నిరంకుశ వైఖరికి ఇది చెంపపెట్టు లాంటిదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన్ను తిరిగి పార్లమెంట్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

Spread the love