శివసాగర్: దేశంలోనే అసోం ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం నాగాలాండ్ నుండి అసోంలో ప్రవేశించింది. ఈ సందర్భంగా శివసాగర్ జిల్లాలోని హాలోవాటింగ్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని, ప్రజా ధనాన్ని దోచుకుంటున్నాయని మండిపడ్డారు. బహుశా దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అస్సాంలోనే ఉన్నదని ఆయన అన్నారు. మణిపూర్‌లో గత సంవత్సరం మే 3వ తేదీ నుంచి ప్రచ్ఛన్న యుద్ధం వంటి పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్ చెప్పారు. జాతి ఘర్షణలతో రాష్ట్రం విడిపోయిందని, అయినా ప్రధాని అక్కడ పర్యటించలేదని విమర్శించారు. నాగా రాజకీయ సమస్య పరిష్కారం కోసం తొమ్మిది సంవత్సరాల క్రితం ఓ ఒప్పందం కుదుర్చుకున్నారని గుర్తు చేస్తూ దాని పరిస్థితి ఏమిటని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. తాను చేపట్టిన యాత్రపై బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ గత సంవత్సరం జరిపిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయ కథనాన్నే మార్చిందని తెలిపారు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు విద్వేషాలను వ్యాపింపజేస్తున్నాయి. వివిధ మతాలకు చెందిన వారి మధ్య చిచ్చు పెడుతున్నాయి. వారు చేసే ఒకే ఒక పని ప్రజాధనాన్ని కొల్లగొట్టడం. దేశాన్ని దోచుకోవడం’ అని రాహుల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.