రాహుల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ !

Rahul's second innings!– రాజకీయ జీవితంలో తొలిసారి ప్రతిపక్ష నేతగా ఎంపిక
– రాజ్యాంగ పదవుల భర్తీలో కీలక పాత్ర
– ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష… వ్యాఖ్యలు… విమర్శలు
– పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి ఆయనే అధిపతి
– క్యాబినెట్‌ మంత్రి హోదాతో పెరిగిన బాధ్యతలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తన రాజకీయ జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. బుధవారం ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను సంప్రదాయం ప్రకారం సభాపతి స్థానం వరకూ తీసుకుని వెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రాహుల్‌కు క్యాబినెట్‌ మంత్రి హోదా లభిస్తుంది. ప్రొటోకాల్‌ జాబితాలో కూడా ఆయన స్థానం పెరుగుతుంది. భవిష్యత్తులో ప్రతిపక్ష కూటమి తరఫున ఆయనే సహజంగా ప్రధాని పదవికి పోటీ పడతారు. రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో రాహుల్‌ గాంధీ రాజ్యాంగబద్ధమైన పదవిని స్వీకరించడం ఇదే మొదటిసారి. కేరళలోని వయనాడ్‌, యూపీలోని రాయబరేలీ నుండి ఎన్నికైన రాహుల్‌ తర్జనభర్జనల అనంతరం వయనాడ్‌ను వదులుకున్న విషయం తెలిసిందే. రాహుల్‌ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్‌ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారు. రాహుల్‌ 2004లో తొలిసారి యూపీలోని అమేథీ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అమేథీ నుంచే ఆయన మూడు సార్లు దిగువసభకు ప్రాతినిధ్యం వహించారు. 2019లో మాత్రం వయనాడ్‌ నుండి ఎన్నికయ్యారు.
ప్రతిపక్ష నేత నిర్వహించే పాత్ర ఏమిటి?
లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలుగా వ్యవహరించే వారికి 1977లో చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. రాజ్యాంగ పదవులకు నియామకాలు జరిపేటప్పుడు ఆ ప్రక్రియలో ప్రతిపక్ష నేత భాగస్వామి అవుతాడు. ఇప్పుడు రాహుల్‌ ప్రతిపక్ష నేత అయినందున లోక్‌పాల్‌, సీబీఐ డైరెక్టర్‌, ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌, సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌, ఎన్‌హెచ్‌ఆర్‌సీ అధిపతి నియామకాల కోసం ఏర్పాటు చేసే కమిటీల్లో ప్రతిపక్ష నేత హోదాలో సభ్యుడిగా వ్యవహరిస్తారు. ఈ నియామకాల కోసం నిర్వహించే సమావేశాలకు ప్రధాని మోడీతో పాటు ఆయన కూడా హాజరవుతారు. ప్రధాని, ఇతర సభ్యులు కూర్చునే టేబుల్‌ వద్దే రాహుల్‌ కూడా ఆశీనులవుతారు. రాజ్యాంగ పదవుల్లో నియామకాలు జరపడానికి ముందు ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ సమ్మతిని ప్రధాని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ కమిటీలలో కూడా రాహుల్‌ భాగస్వామిగా ఉంటారు. ప్రభుత్వం తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాలను ఆయన నిరంతరం సమీక్షించవచ్చు. ప్రభుత్వ నిర్ణయాలపై వ్యాఖ్యలు చేయవచ్చు. ప్రభుత్వ వ్యయాలను పరిశీలించే పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి ప్రతిపక్ష నేతే అధిపతిగా ఉంటారు. ప్రభుత్వ వ్యయాలను సమీక్షించిన తర్వాత వాటిపై వ్యాఖ్యానాలు చేస్తారు. ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ ప్రధాన కమిటీలలో కూడా చేరవచ్చు. ప్రభుత్వ పనితీరును నిరంతరం సమీక్షించే హక్కు ఆయనకు ఉంటుంది.
గురుతరమైన బాధ్యతే
ప్రతిపక్ష నేత పనితీరు సభాపతికి పూర్తి భిన్నంగా ఉంటుంది. కానీ సభలో ఆ బాధ్యతకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతిపక్షం కీలకపాత్ర నిర్వహిస్తుంది. ప్రతిపక్షాలు సమర్ధవంతమైన విమర్శలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్లమెంటులో ప్రతిపక్షాలు అత్యంత ప్రాముఖ్యత కలిగిన భూమిక నిర్వహిస్తాయ నడంలో సందేహమేమీ లేదు. అధికార పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతుంటే ప్రతిపక్షం పరిపాలనలోని తప్పులను ఎత్తి చూపుతూ విమర్శిస్తుంది. కాబట్టి ఈ రెండింటికీ కర్తవ్యాలు, హక్కులు ఉంటాయి. ప్రభుత్వంపై, మంత్రులపై విమర్శలు చేయడం ప్రతిపక్షాల విధి. ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి ఏకాభిప్రాయంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. పరస్పరం గౌరవించుకుంటూ సహనంతో వ్యవహరించకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటుంది.
లభించే సౌకర్యాలివే..
ప్రతిపక్ష నేత రాహుల్‌కు క్యాబినెట్‌ మంత్రి హోదా లభిస్తుంది. ప్రభుత్వం ఆయనకు బంగ్లా సమకూరుస్తుంది. సచివాలయంలో కార్యాలయం ఉంటుంది. గరిష్ట స్థాయిలో భద్రత కల్పిస్తారు. విమానం, రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు. నెలకు జీతం, ఇతర అలవెన్సులు కలిపి రూ.3.30 లక్షలు లభిస్తాయి. హాస్పిటాలిటీ అలవెన్సు కూడా ఇస్తారు. ప్రతి సంవత్సరం దేశంలో ఎక్కడికైనా 48 ప్రయాణాలకు అలవెన్సు లభిస్తుంది. ఇక టెలిఫోన్‌, కార్యదర్శి, వైద్య సౌకర్యం సరేసరి.
గాంధీ కుటుంబంలో మూడో వ్యక్తి
గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించడం ఇది మూడోసారి. గతంలో సోనియా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఈ బాధ్యతను నిర్వర్తించారు. సోనియా 1999 అక్టోబర్‌ 13 నుంచి 2004 ఫిబ్రవరి 6వ తేదీ వరకూ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంతకుముందు రాజీవ్‌ 1989 డిసెంబర్‌ 18 నుండి 1990 డిసెంబర్‌ 24 వరకూ ఈ పదవిలో కొనసాగారు. 2014, 2019లో ప్రతిపక్ష హోదా కోరేందుకు అవసరమైన సంఖ్యాబలం కాంగ్రెస్‌కు లభించలేదు. 2019లో 52 స్థానాలు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్‌, ఇప్పుడు దానికి దాదాపు రెట్టింపు సంఖ్యలో 99 సీట్లు సాధించింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 44 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ రెండు సందర్భాల్లోనూ బీజేపీ తర్వాత సభలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందలేకపోయింది. నిబంధనల ప్రకారం దిగువసభలోని మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లను గెలుచుకోలేకపోతే ప్రతిపక్ష నేత పదవిని కోరే హక్కు లభించదు.

Spread the love