నవతెలంగాణ – హైదరాబాద్
రైల్వే కేటరింగ్ సేవల్లో సమూల మార్పులు తీసుకురానున్నట్టు రైల్వే శాఖ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో వివిధ ప్రాంతాల రుచులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. రైల్వే శాఖ మంత్రి అధ్యక్షతన పార్లమెంటు సభ్యుల సంప్రదింపుల కమిటీ గురువారం సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కేటరింగ్, రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై సమీక్షించారు. రోజూ 1.80 కోట్ల మంది ప్రయాణిస్తున్న రైళ్లల్లో నాణ్యమైన ఆహార లభ్యత కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. వివిధ వయోవర్గాలకు తగిన ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆహార నాణ్యత విషయంలో థర్డ్ పార్టీతో తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఆకస్మిక తనిఖీలు కూడా చేపడుతున్నామని చెప్పారు. దేశంలోని పలు స్టేషన్లలో చేపట్టిన అభివృద్ధి, ఆధునికీకరణ చర్యల గురించి మంత్రి సమావేశంలో వివరించారు.