ఒడిశా రైలు ప్రమాదంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు : రైల్వే మంత్రి

నవతెలంగాణ – బాలాసోర్: ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురికావడంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం చెప్పారు. సహాయక చర్యలపైనే తాము ముఖ్యంగా దృష్టి సారించామని, బాధితులకు వైద్య సహాయం అందించడమే తమ మొదటి కర్తవ్యమని చెప్పారు. భారతీయ రైల్వేలు విడుదల చేసిన ప్రకటనలో, ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు జరుగుతుందని తెలిపింది. సౌత్ ఈస్ట్ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్ ఏఎం చౌదరి నేతృత్వంలో ఈ స్వతంత్ర దర్యాప్తు జరుగుతుందని తెలిపింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, జాతీయ విపత్తు స్పందన దళం బృందాలకు ధన్యవాదాలు తెలిపారు. బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి, చురుగ్గా సహాయపడుతున్నందుకు ఎన్‌డీఆర్ఎఫ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడారు. సహాయక చర్యలపైనే తాము ముఖ్యంగా దృష్టి సారించామని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం నుంచి అనుమతి వచ్చిన తర్వాత పునరుద్ధరణ చర్యలు ప్రారంభమవుతాయని చెప్పారు. అత్యున్నత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని, అదేవిధంగా రైల్వే భద్రతా కమిషనర్ స్వతంత్ర దర్యాప్తు చేస్తారని తెలిపారు. అంతకుముందు ఆయన ప్రమాదానికి గురైన రైలు బోగీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటనా స్థలంలో అన్ని వైపులా నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు.

Spread the love