డర్బన్‌లో వర్షం.. టాస్‌ ఆలస్యం..

నవతెలంగాణ- హైదరాబాద్: భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య డర్బన్‌ వేదికగా జరగాల్సి ఉన్న తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. డర్బన్‌లోని కింగ్స్ మీడ్‌ మైదానం వేదికగా తొలి టీ20 జరగాల్సి ఉండగా.. టాస్ వేయడానికి కొద్దిసేపు ముందు వర్షం మొదలవడంతో ఇరు జట్ల సారథులు ఫీల్డ్‌కు రాలేదు. నిన్నట్నుంచి ఇక్కడ వర్షం కురుస్తుండటంతో కింగ్స్‌మీడ్‌ పిచ్‌పై కవర్స్‌ కప్పిఉంచారు. అయితే మ్యాచ్‌ ఆరంభం నాటికి వర్షం ఆగిపోతుందని భావించినా అప్పటిదాకా లేని వర్షం సరిగ్గా టాస్‌ సమయానికి ముందే మొదలైంది. మూడు ఫార్మాట్ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాకు వచ్చిన భారత్‌.. నేటి నుంచి మొదలుకాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడాల్సి ఉంది. సిరీస్‌ ముగిసిన తర్వాత వన్డేలు, టెస్టులు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆడిన యువ భారత్‌తోనే భారత్‌ బరిలోకి దిగబోతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో సఫారీ సవాల్‌ను చూద్దామనుకుని టీవీలు, ఫోన్ల ముందుకు వచ్చిన అభిమానులను వర్షం నిరాశకు గురిచేస్తోంది. డర్బన్‌లో టాస్‌ తిరిగి ఎప్పుడు పడనుందనేది ఇంకా స్పష్టత రాలేదు.

Spread the love