వర్ష బీభత్సం

Rain disaster, 50 people died in Himachal Pradesh– హిమాచల్‌ ప్రదేశ్‌లో 50మంది మృతి
– మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
– కొట్టుకుపోయిన రైల్వే లైన్లు
– కూలుతున్న కొండచరియలు
షిమ్లా : భారీ వర్షాలు, వరదలు హిమాచల్‌ ప్రదేశ్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చరియలు ఎక్కడివక్కడ కూలుతున్నాయి. నదులు, వాగులు పొంగుతుండటంతో పలు ప్రాంతాల్లో రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. అధికారిక సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రానికి వర్షాలు, వరదలు బారిన పడి 50 మంది మరణించారు. ఇరవై మంది ఆచూకీ తెలియలేదు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వర్ష బీభత్సం నేపథ్యంలో స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నగరం సిమ్లాలోని సమ్మర్‌హిల్‌ వద్ద సోమవారం ఉదయం శివాలయం ఒకటి కూలిపోయింది. ఈ ఆలయ శిధిలాల్లోంచి సాయంత్రానికి తొమ్మిది మంది మృత దేహాలను వెలికి తీశారు. మరికొందరు శిధిలాల కింద ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫాగ్లి ప్రాంతంలోని రబల్‌ వద్ద మరో ఆలయం కూడా కూలిపోయింది. ఈ శిధిలాల కింద చిక్కుకుని ఐదుగురు మరణించారు. రెండు చోట్ల పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టారు. ఎస్‌డిఆర్‌ఎఫ్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌,ఐటిబిపిలతో పాటు రాష్ట్ర పోలీసులు ఈ కార్యక్రమాల్లో నిమగమైనారు. శనివారం రాత్రి నుండి ఇక్కడ వర్షాలు ప్రారంభం కాగా, 18వతేది వరకు తీవ్ర స్థాయిలో కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని 12 జిల్లాలకు గానే 9 జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ హెచ్చరికల్లో ఐఎండి పేర్కొంది. ఐదు జిల్లాలకు మంగళవారం నాటికి ఎల్లో వార్నింగ్‌ను జారీ చేసింది.
భారీ వర్పాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రాజధానికి దారితీసే ప్రధాన రహదారితో పాటు 621 రోడ్లు దెబ్బతిన్నాయి. కొండ రాళ్లను తొలగించడం సాధ్యంకాకపోవడంతో ఈ అన్ని రోడ్ల మీద రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 752 రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.ముఖ్యమంత్రి సుఖ్‌విదుర్‌ సింగ్‌ ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొద్దిరోజుల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకూ కాంగ్రా ప్రాంతంలో 273 మీమీ వర్షపాతం నమోదయింది. ధర్మశాలలో 250 మీమీ వర్షపాతం, సుందర్‌నగర్‌లో 168 మీమీ, మండిలో 140 మీమీ, జుబర్హత్తిలో 132 మీమీ, షిమ్లాలో 126 మీమీ, బెర్తిన్‌లో 120 మీమీ, ధౌలకౌంలో 111 మీమీ, నహాన్‌లో 107 మీమీ వర్షాపాతం నమోదయింది.
7వేల కోట్ల ఆస్తి నష్టం
ప్రస్తుత వర్షా కాలం ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు తమ రాష్ట్రంలో 7,171 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌ 24 నుంచి ఇప్పటి వరకూ ఈ మేరకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. 170 వరకూ కొండచరియలు విరిగిపడిన, పిడిగులు పడిన సంఘటనలు జరిగినట్లు చెప్పారు. ఈ వర్ష కాలంలో 9,600 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు.

Spread the love