పెషావర్: పాకిస్తాన్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాలు పెను బీభత్సాన్ని సృష్టించాయి. ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి 29 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. పలు ఇళ్లు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడి రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. వాయువ్య ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తినష్టం ఎక్కువగా ఉందని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. సహాయక చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. రహదారులపై కూలిన చెట్లను, చెత్తను తొలగించడానికి భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్తరాదికి వెళ్లవద్దని అధికారులు పర్యాటకులకు సూచించారు. గత వారం, భారీ వర్షాల కారణంగా అనేక మంది సందర్శకులు అక్కడ చిక్కుకుపోయారు.