హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి వర్షం

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్టా, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, కొండాపూర్‌, మెహదీపట్నం, నాంపల్లి, కోఠి, ఛాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, బీఎన్‌రెడ్డి, ఉప్పల్‌, నాగోల్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లిలో వానపడుతున్నది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. అయితే వాహనాల రాకపోకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. వచ్చిన నీరు వచ్చినట్టే వెళ్లిపోయేలా చూస్తున్నారు. కాగా, రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌పై అల్పపీడనం ఏర్పడిందని వివరించింది. ఇది నేడు దక్షిణ దిశకు కదిలే సూచనలున్నాయని పేర్కొంది. అదేవిధంగా బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో వర్షాలు మరింత పెరుగుతాయని అంచనా వేసింది.

Spread the love