అన్యాయాలకు వ్యతిరేకంగా స్వరం పెంచింది ఇప్టానే..

అన్యాయాలకు వ్యతిరేకంగా స్వరం పెంచింది ఇప్టానే..– తెలంగాణ సాయుధ పోరాట యోధులు కందిమళ్ల ప్రతాప్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అన్యాయాలకు వ్యతిరేకంగా స్వరం పెంచింది ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ (ఇప్టా)నే అని తెలంగాణ సాయుధ పోరాట యోధులు కందిమళ్ల ప్రతాపరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని అనుముల సత్యనారాయణ రెడ్డి భవన్‌లో తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఇప్టా 81వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ భారతదేశ సాంస్కృతిక చరిత్రలో ఇప్టాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అణగారిన వర్గాల వాణిగా నేటికీ అది పని చేస్తున్నదని చెప్పారు. డప్పు, పాటలు, నాటకాలు, జానపదాల ద్వారా ప్రజల్లో సాంస్కృతిక చైతన్యం తీసుకొచ్చిందన్నారు. స్వాతంత్రోద్యమంలో, చారిత్రిక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనేలా పౌరులను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజా నాట్యమండలి పైన ప్రభుత్వం విపరీతమైన నిర్బంధకాండను సాగించిందన్నారు. ‘మాభూమి’ నాటకాన్నీ, పాటలను, జానపద కార్యక్రమాలను నిజాం ప్రభుత్వం అణచివేసిందని అయన గుర్తు చేసారు. 1943 సంవత్సరంలో ఆనాటి నాటక, చలన చిత్ర దిగ్గజాలు బాలరాజ్‌ సహానీ, సలీల్‌ చౌదరి, పృథ్వీరాజ్‌ కపూర్‌, కె.ఏ. అబ్బాస్‌, శంభో మిత్ర, పండిట్‌ రవి శంకర్‌, ఆనంద్‌ శంకర్‌, కైఫీ అజ్మి, ఏ.కె. హంగల్‌ లాంటి మహానుబాహుల సారథ్యంలో ఇప్టా ఆవిర్భవించిందని వివరించారు. నాటి నుంచి దేశంలో సాహిత్యం, చరిత్ర, సినిమా, సంగీతం, సంస్కృతి, రాజకీయ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తువస్తుం దని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్య మండలి అధ్యక్షులు కె. శ్రీనివాస్‌తో పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ నేతృత్వంలో పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.

Spread the love