నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నెలలోనే తమ పార్టీకి చెందిన 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. 119 నియోజకవర్గాలకు గాను కేవలం నాలుగుచోట్ల మాత్రమే పెండింగ్‌లో ఉంచారు. స్వల్ప మార్పులు, చేర్పులతో మిగతా అన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటించారు. టిక్కెట్ దక్కని వారిలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉన్నారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ రాజయ్య టిక్కెట్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది. తాజాగా బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అభ్యర్థుల లిస్ట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని అధినేత కేసీఆర్ చెప్పారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యలో అటు వాళ్లు ఇటు… ఇటు వాళ్లు అటు కావొచ్చన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపే స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ అవుతుందన్నారు.