మంత్రి హరీశ్ రావుకు ఫ్యాన్ అయిపోయా: రాజమౌళి

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. సిద్దిపేట అభివృద్ధిని చూసినప్పటి నుంచి హరీశ్ రావుకి తాను ఫ్యాన్ అయ్యానని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ సైతం నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. బంజారాహిల్స్ లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హరీశ్ రావు, రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘సిద్దిపేటలో గతంతో పోలిస్తే చాలా అభివృద్ధి జరిగింది. నియోజకవర్గ అభివృద్ధిలో మంత్రి హరీశ్ రావు కృషి తెలిశాక.. నేను ఆయన అభిమానిగా మారిపోయా. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు’’ అని చెప్పారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. బాహుబలితో తెలుగు సినిమాను దేశ వ్యాప్తం చేస్తే.. ఆర్ఆర్ఆర్ తో విశ్వవ్యాప్తం చేశారని రాజమౌళిని ప్రశంసించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటకు ఆస్కార్ రావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. రాజమౌళిని మంత్రి సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీసి, విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

Spread the love