రేసులోనే రాజస్థాన్‌!

– పంజాబ్‌ కింగ్స్‌పై రాయల్స్‌ గెలుపు
– ఛేదనలో జైస్వాల్‌, పడిక్కల్‌ మెరుపుల్‌
ధర్మశాల : ఐపీఎల్‌ 16 ప్లే ఆఫ్స్‌ రేసులో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆశలు సజీవం. సీజన్లో తమ చివరి లీగ్‌ దశ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 188 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ 19.4 ఓవర్లలోనే ఊదేసింది. ఛేదనలో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (50, 36 బంతుల్లో 8 ఫోర్లు), దేవదత్‌ పడిక్కల్‌ (51, 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలకు తోడు షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (46, 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కదం తొక్కాడు. జోశ్‌ బట్లర్‌ (0), కెప్టెన్‌ సంజు శాంసన్‌ (2) నిరాశపరిచినా.. యువ ఆటగాళ్లు అదరగొట్టారు. రియాన్‌ పరాగ్‌ (20, 12 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), ధ్రువ్‌ జురెల్‌ (10 నాటౌట్‌, 4 బంతుల్లో 1 సిక్స్‌) ఒత్తిడిలో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. పంజాబ్‌ కింగ్స్‌ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ రేసులో నిలిచినా.. రాజస్థాన్‌ రాయల్స్‌ మరో 2 బంతులు ఉండగానే ఉత్కంఠ ఛేదనను విజయవంతంగా ముగించింది. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో కగిసో రబాడ (2/40) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో సీజన్లో ఏడో విజయం నమోదు చేసిన రాజస్థాన్‌ 14 పాయింట్లతో నిలిచింది. ప్లే ఆఫ్స్‌ ఆశలు నిలుపుకున్న రాజస్థాన్‌ ముందుకెళ్లేందుకు ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడనుంది. ఇక సీజన్లో ఎనిమిదో పరాజయంతో పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌16 నుంచి నిష్క్రమించింది.
తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. ప్రభుసిమ్రన్‌ (2), ధావన్‌ (17), లివింగ్‌స్టోన్‌ (9) వైఫల్యంతో 50 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకున్న పంజాబ్‌ ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో శామ్‌ కరణ్‌ (49 నాటౌట్‌, 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జితేశ్‌ శర్మ (44, 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), షారుక్‌ ఖాన్‌ (41, 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పంజాబ్‌కు మంచి స్కోరు అందించారు. రాజస్థాన్‌ బౌలర్లలో నవదీప్‌ సైని (3/40) మూడు వికెట్ల ప్రదర్శన చేశాడు.

Spread the love