రాజస్థాన్‌ రాయల్స్‌ ఢమాల్‌.

– 59కే కుప్పకూలిన రాయల్స్‌
 – సిరాజ్‌, వేనీ పార్నెల్‌ విజృంభణ
112 పరుగుల తేడాతో బెంగళూర్‌ గెలుపు

నవతెలంగాణ-జైపూర్‌
మూడు రోజుల క్రితం 150 పరుగుల లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో ఊదేసిన రాజస్థాన్‌ రాయల్స్‌.. తాజాగా 171 పరుగుల ఛేదనలో 10.3 ఓవర్లలోనే కుప్పకూలింది. టాప్‌ ఆర్డర్‌ వైఫల్యంతో మూడు రోజుల్లోనే భిన్నమైన ప్రదర్శనతో పరాజయం చవిచూసిన రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్షిష్టం చేసుకుంది. బౌలర్ల విజృంభణతో 112 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపర్చుకుంది.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ భారీ విజయం నమోదు చేసింది. బౌలర్లు మహ్మద్‌ సిరాజ్‌ (1/10), వేనీ పార్నెల్‌ (3/10), మైకల్‌ బ్రాస్‌వెల్‌ (2/16), కరణ్‌ శర్మ (2/19) వికెట్ల వేటలో మ్యాజిక్‌ చేశారు. 172 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌ 10.3 ఓవర్లలోనే కుప్పకూలింది. షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (35, 19 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) రాజస్థాన్‌ రాయల్స్‌కు 50 ప్లస్‌ స్కోరు అందించాడు. ఐదుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే నిష్క్రమించగా రాజస్థాన్‌ రాయల్స్‌ 59 పరుగులకే చేతులెత్తేసింది. 112 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఘన విజయం సాధించింది. అంతకముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (55, 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (54, 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. చివర్లో అనుజ్‌ రావత్‌ (29 నాటౌట్‌, 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. పవర్‌ప్లేలో మూడు వికెట్లు పడగొట్టిన వేనీ పార్నెల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు సాధించాడు.
పార్నెల్‌, సిరాజ్‌ నిప్పులు :
రాజస్థాన్‌ లక్ష్యం 172 పరుగులు. ఆ జట్టు ఆడిన గత మ్యాచ్‌లో ఛేదనను 13.1 ఓవర్లలోనే ఊదేసింది. దీంతో సహజంగానే రాయల్స్‌ ఫేవరేట్‌గా కనిపించింది. కానీ పవర్‌ప్లేలో మహ్మద్‌ సిరాజ్‌, వేనీ పార్నెల్‌ అద్వితీయ బౌలింగ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వికెట్ల పతనంతో సంబంధం లేకుండా పవర్‌ప్లేలో ఎదురుదాడి చేసే రాయల్స్‌ ప్రణాళిక ఇక్కడ బెంగళూర్‌కు కలిసొచ్చింది. భీకర ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ (0)ను సిరాజ్‌ సాగనంపగా.. వేనీ పార్నెల్‌ తన ఓవర్లో జోశ్‌ బట్లర్‌ (0), సంజు శాంసన్‌ (4) కథ ముగించాడు. దేవదత్‌ పడిక్కల్‌ (4)ను బ్రాస్‌వెల్‌ అవుట్‌ చేయగా.. ఆరో ఓవర్లో జో రూట్‌ (10)ను వేనీ పార్నెల్‌ బలిగొన్నాడు. దీంతో పవర్‌ప్లేలో రాజస్థాన్‌ రాయల్స్‌ 28 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. జైస్వాల్‌, బట్లర్‌, శాంసన్‌ వికెట్లతో ఛేదనలో చతికిల పడిన రాజస్థాన్‌.. ఆ తర్వాత మిడిల్‌ ఆర్డర్‌ పతనంతో కోలుకోలేదు. లోయర్‌ ఆర్డర్‌ కథను స్పిన్నర్‌ కరణ్‌ శర్మ ముగించాడు. దీంతో 10.3 ఓవర్లలో 59 పరుగులకే రాజస్థాన్‌ కుప్పకూలింది. షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (35) ఒక్కడే బెంగళూర్‌ బౌలర్లపై పైచేయి సాధించాడు. నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదిన హెట్‌మయర్‌ రాయల్స్‌కు 50 ప్లస్‌ స్కోరు అందించాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇది మూడో అత్యల్ప స్కోరు కావటం గమనార్హం. రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోరు సాధించారు. ఐదుగురు డకౌట్‌గా వికెట్‌ కోల్పోయారు. 13 మ్యాచుల్లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఇది ఏడో పరాజయం. 12 పాయింట్లతో ఆ జట్టు ప్రస్తుతం ఆరో స్థానానికి పడిపోయింది. చివరి మ్యాచ్‌లో నెగ్గినా.. ఇతర మ్యాచుల ఫలితాలపై రాయల్స్‌ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం రాజస్థాన్‌ రాయల్స్‌ చేజారింది.
డుప్లెసిస్‌, మాక్స్‌ ఫిఫ్టీలు :
టాస్‌ నెగ్గిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు విరాట్‌ కోహ్లి (18), డుప్లెసిస్‌ (55) తొలి వికెట్‌కు శుభారంభం అందించారు. ఏడు ఓవర్లలో 50 పరుగులు జోడించిన అనంతరం విరాట్‌ కోహ్లి వికెట్‌ కోల్పోయాడు. రాయల్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయటంతో బెంగళూర్‌ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడలేకపోయింది. డుప్లెసిస్‌కు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (54) జత కట్టడంతో బెంగళూర్‌ స్కోరు బోర్డుకు ఊపొచ్చింది. మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లు బాదిన మాక్స్‌వెల్‌ సీజన్లో అర్థ సెంచరీ సాధించాడు. డుప్లెసిస్‌ సైతం ఫామ్‌ను కొనసాగిస్తూ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. మిడిల్‌ ఆర్డర్‌లో మహిపాల్‌ (1), దినేశ్‌ కార్తీక్‌ (0) విఫలమైనా.. చివర్లో అనుజ్‌ రావత్‌ (29 నాటౌట్‌, 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టాడు. చివరి ఓవర్లో రెండు సిక్సర్లు సహా ఓ బౌండరీ బాదిన రావత్‌ బెంగళూర్‌కు మంచి స్కోరు అందించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో జంపా, అసిఫ్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక 12 మ్యాచుల్లో ఆరో విజయం నమోదు చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 12 పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో నిలిచింది. మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగా బెంగళూర్‌ దర్జాగా 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరుకునేందుకు అవకాశం ఉంది. 112 పరుగుల తేడాతో విజయం సాధించటంతో బుణాత్మక నెట్‌రన్‌రేట్‌ నుంచి సైతం బయటపడింది.
స్కోరు వివరాలు :
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ : విరాట్‌ కోహ్లి (సి) యశస్వి జైస్వాల్‌ (బి) అసిఫ్‌ 18, డుప్లెసిస్‌ (సి) యశస్వి జైస్వాల్‌ (బి) అసిఫ్‌ 55, మాక్స్‌వెల్‌ (బి) సందీప్‌ శర్మ 54, మహిపాల్‌ (సి) ధ్రువ్‌ జురెల్‌ (బి) జంపా 1, దినేశ్‌ కార్తీక్‌ (ఎల్బీ) జంపా 0, బ్రాస్‌వెల్‌ నాటౌట్‌ 9, అనుజ్‌ రావత్‌ నాటౌట్‌ 29, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171.
వికెట్ల పతనం : 1-50, 2-119, 3-120, 4-120, 5-137.
బౌలింగ్‌ : సందీప్‌ శర్మ 4–0-34-1, ఆడం జంపా 4-0-25-2, యుజ్వెంద్ర చాహల్‌ 4-0-37-0, అశ్విన్‌ 4-0-33-0, అసిఫ్‌ 4-0-42-2.
రాజస్థాన్‌ రాయల్స్‌ : యశస్వి జైస్వాల్‌ (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 0, జోశ్‌ బట్లర్‌ (సి) సిరాజ్‌ (బి) పార్నెల్‌ 0, సంజు శాంసన్‌ (సి) అనుజ్‌ రావత్‌ (బి) పార్నెల్‌ 4, జో రూట్‌ (ఎల్బీ) పార్నెల్‌ 10, దేవదత్‌ పడిక్కల్‌ (సి) సిరాజ్‌ (బి) బ్రాస్‌వెల్‌ 4, షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (సి) బ్రాస్‌వెల్‌ (బి) మాక్స్‌వెల్‌ 35, ధ్రువ్‌ జురెల్‌ (సి) మహిపాల్‌ (బి) బ్రాస్‌వెల్‌ 1, అశ్విన్‌ రనౌట్‌ 0, ఆడం జంపా (బి) కరణ్‌ శర్మ 2, సందీప్‌ శర్మ నాటౌట్‌ 0, అసిఫ్‌ (సి) కోహ్లి (బి) కరణ్‌ శర్మ 0, ఎక్స్‌ట్రాలు : 3, మొత్తం : (10.3 ఓవర్లలో ఆలౌట్‌) 59.
వికెట్ల పతనం : 1-1, 2-6, 3-7, 4-20, 5-28, 6-31, 7-50, 8-59, 9-59, 10-59.
బౌలింగ్‌ : మహ్మద్‌ సిరాజ్‌ 2-0-10-1, వేనీ పార్నెల్‌ 3-0-10-3, మైకల్‌ బ్రాస్‌వెల్‌ 3-0-16-2, కరణ్‌ శర్మ 1.3-0-19-2, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 1-0-3-1.

Spread the love