ముగిసిన రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఓ ప్రోగ్రాం షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం కి వెళ్లిన రాకేష్ మాస్టర్ తిరిగి వస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో గాంధీ హాస్పిటల్ లో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాకేష్ మాస్టర్ అడ్మిట్ అయ్యారు. డయాబెటిక్ పేషంట్ , సివియర్ మెటబాలిక్ ఎసిడోసిక్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందారని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రాకేష్ మాస్టర్ మరణ వార్తతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయనకు నివాళి అర్పించారు. ఇక కాసేపటి క్రితమే రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు ముగిశాయి. బోరబండ స్మశాన వాటికలో అంత్యక్రియలను ఆయన కుమారుడు చరణ్ నిర్వహించారు. 1968 తిరుపతిలో జన్మించిన రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్ రామారావు. తెలుగు సినీ పరిశ్రమలో 1500కు పైగా సినిమాలకు ఆయన పని చేశారు.

Spread the love