– ఎన్టీఆర్ కేసీఆర్ గురుశిష్యులు
– కాంగ్రెస్‌వి అలవికాని హామీలు
– కర్నాటక, ఢిల్లీల నుంచి డబ్బు సంచులు
– డబ్బులిస్తే తీసుకోండి.. కారుకే ఓటేయండి
– ఖమ్మం సభలో మంత్రి కేటీఆర్
– ఎన్టీఆర్‌తో కేసీఆర్‌ను పోల్చడంపై విమర్శలు
– పర్యటన నేపథ్యంలో విపక్ష నేతల నిర్బంధం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘గ్యారెంటీలు.. గ్యారెంటీలు అని ఊదర కొడుతున్న వాళ్లకు.. వాళ్ల సీటు గ్యారెంటీ ఉందా..? వాళ్ల పార్టీకి వారెంటీ ఉందా? ఆలోచించండి. ఆరిపోయే దీపం లాంటి పార్టీ.. డైలాగులు కొడితే మళ్లీ ఆగమవుదామా..? అభివృద్ధిలో భాగమవుదామా..? ఆలోచించండి..” అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పువ్వాడ అజరుకుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ ఎదుట శనివారం ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ మాట్లాడారు. అభివృద్ధి సాగాలంటే, ప్రగతి రథ చక్రాలు ముందుకు కదలాలంటే అందరి ఆశీర్వాదం కావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని, అలవికాని హామీలను ఇక్కడ ఇస్తున్నారని తెలిపారు. డబ్బులిస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలన్నారు. నగరంలో రూ.1370 కోట్ల పనులకు శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఎన్టీఆర్‌తో కేసీఆర్‌కు పోలిక..
ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ వద్ద ఎన్టీఆర్ పార్కుతోపాటు కాంస్య విగ్రహాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఎన్టీఆర్‌తో కేసీఆర్‌కు పోలిక పెడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవం నేపథ్యంలో విగ్రహాన్ని ప్రారంభించామన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అందర్నీ ఆదరించి.. పేదలను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. చరిత్ర రాసినప్పుడు కొన్ని వాస్తవాలను మరుగున పడవేయలేమన్నారు. తెలుగు వారు ఉన్నారని దేశమంతా మనవైపు చూసేటట్టు చేసింది ఎన్టీఆర్ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎంతో ఆప్తుడు ఎన్టీఆర్ అని, ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన మహానుభావుడని కొనియాడారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదని, ఆ రెండూ ఆయనేనని అన్నారు. అదే మాదిరిగా తెలంగాణవాళ్లు ఉన్నారని ఈ దేశం మొత్తం చాటిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. గురువు ఎన్టీ రామారావు చేయలేని పని, వారి శిష్యుడు కేసీఆర్‌చేసే అవకాశం ఉందన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ కూడా హ్యాట్రిక్ సీఎం కాలేదని తెలిపారు. కానీ ‘గురువును మించిన శిష్యుడిగా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని’ జోస్యం చెప్పారు. దాంతో ఎన్టీఆర్ ఆత్మ కూడా శాంతిస్తుందన్నారు. ఈ పర్యటనలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్, బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీలు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ, డీసీసీబీ, విత్తనాభివృద్ధి సంస్థ, సుడా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మెన్‌లు లింగాల కమలరాజ్, కూరాకుల నాగభూషణం, కొండబాల కోటేశ్వరరావు, బచ్చు విజరుకుమార్, వైరా బీఆర్‌ఎస్ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంకటవీరయ్య ఆధ్వర్యంలో సత్తుపల్లిలో సభ నిర్వహించారు.
ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం
ఎన్టీఆర్‌కు కేసీఆర్‌కు పోలిక పెట్టడం.. గురువును మించిన శిష్యుడు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కేటీఆర్ ప్రారంభించడంతో రామారావు ఆత్మ శాంతించడం కాదు క్షోభిస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో కేటీఆర్ ప్రారంభించిన విగ్రహాన్ని ఆదివారం పసుపునీళ్లతో శుద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ విగ్రహం ప్రారంభ సందర్భంగా ఆయన ముఖంపై ముసుగు తొలగకపోవడంతో ఆ తర్వాత హైడ్రాలిక్ మిషన్ సహాయంతో తీశారు. తిరుగు పయనంలో కేటీఆర్ మళ్లీ ఆ విగ్రహం దగ్గరకు వచ్చి నాయకులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.
తుమ్మల, పొంగులేటిపై పరోక్ష విమర్శలు..
కొణిజర్ల మండలం అంజనాపురంలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన సభలో కేటీఆర్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. కేసీఆర్ పదవి ఇస్తే మంచోడు, ఇవ్వకుంటే చెడ్డోడని, పదవుల కోసం పార్టీలు మారే నాయకులు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారన్నారు. 50 ఏండ్లుగా తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వొద్దన్నారు.
విపక్ష నేతల అరెస్ట్
కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని ముందుగానే కాంగ్రెస్ నేతలు ప్రకటించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు సీపీఐ(ఎం) నేతలు, వామపక్ష విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేశారు. అయితే బీజేపీ నాయకులను మాత్రం నిర్బంధించకపోవడం చర్చనీయాంశమైంది. మిక్కిలినేని నరేంద్ర, కాంగ్రెస్ కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల, సైదులు, చోటాబాబా, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, బి.రాంబాబు, ఎస్.నవీన్‌రెడ్డి, తాళ్లపల్లి కృష్ణ, షేక్ బషీరుద్దీన్, టీడీపీ నుంచి నల్లమల రంజిత్, శ్రీనివాసరావు, చేతుల నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుండగా భారీ వర్షం కారణంగా కేటీఆర్ భద్రాచలం పర్యటన రద్దయింది.