నవతెలంగాణ-హైదరాబాద్ : ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’కు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మద్దతు పలికారు. జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని, ఏ పార్టీకైనా దీనితో ప్రయోజనమేనని అన్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి రామ్‌నాథ్ కోవింద్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏకకాలంలో ఎన్నికలకు (జమిలి) అన్ని గుర్తింపు పొందిన పార్టీలతోనూ తాను మాట్లాడామని, వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సమయంలో జమిలి ఎన్నికలను మద్దతు తెలిపాయని అన్నారు. జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని, ఇందుకు అన్ని పార్టీలు నిర్మాణాత్మకంగా మద్దతు తెలపాలని మాజీ రాష్ట్రపతి కోరారు. జమిలి ఎన్నికలతో డబ్బు ఆదా అవుతుందని, దానిని అభివృద్ధి పనులకు ఉపయోగించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.