రామోజీ అడ్డుగోడలు కూల్చుతాం..!

We will tear down the barriers of Ramoji..!– ఫిల్మ్‌ సిటీలోని పేదల భూముల్లో గుడిసెలు వేస్తాం
– రామోజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
– ఇంటి జాగాలను పేదలకు అప్పగించాలి : సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య
– కలెక్టరేట్‌ ఎదుట బాధితులతో కలిసి ధర్నా, వినతి
– మంగళవారం చర్చలు జరుపుతామని కలెక్టర్‌ హామీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రామోజీ ఫిల్మ్‌ సిటీలో పేదల ఇంటి జాగాలను కబ్జా పెట్టి అడ్డుగోడలు కట్టారని, వాటిని కూల్చి ఆ జాగాల్లో పేదలతో గూడిసెలు వేయిస్తామని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రామోజీ ఫిల్మ్‌ సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటి జాగాలకు సర్టిఫికెట్లు ఉన్నా వాటికి నోచుకోని బాధితులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్‌, పోల్కంపల్లి, నాగన్‌పల్లి గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి.. ఎన్నో ఏండ్లుగా ఇంటి జాగాలు లేక.. ఇబ్బందులు పడుతున్నాం.. ఆనాడు ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇచ్చిన జాగాలను తమకు ఇప్పించాలి.. తమ భూములను కబ్జా పెట్టిన రామోజీ ఫిల్మ్‌ సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. పేదల ఇంటి జాగాల కోసం కేటాయించిన భూములను రామోజీ ఫిల్మ్‌ సిటీ యాజమాన్యం కబ్జా పెట్టి, పేదలకు దక్కకుండా అడ్డుకుంటోందన్నారు. దీనిపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీ యాజమాన్యం రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ప్రోద్భలంతో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా అక్రమించుకుని సొమ్ము చేసుకుంటుందన్నారు. ఇదే క్రమంలో 2007లో ఆనాటి ప్రభుత్వం ఇంటి జాగాలు లేని నిరుపేద కుటుంబాలకు ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామంలోని సర్వేనెంబర్‌ 189లో 12ఎకరాలు, 203లో 8 ఎకరాల 4 గుంటల భూమిని నాగన్‌పల్లి, పోల్కంపల్లి, రాయపోల్‌, ముకునూర్‌ గ్రామాలకు చెందిన 675 మంది పేదలకు ఇచ్చిందని తెలిపారు. ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున ఇంటి స్థలం పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. దీనికి లేఅవుట్‌, నక్ష ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి లబ్దిదారులను నమ్మించి. అప్పుడున్న అధికారులు కొంతమంది లబ్దిదారుల నుంచి ఇంటి పట్టాలను కూడా తీసుకున్నారని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదన్నారు. దాంతో 17 ఏండ్లుగా సీపీఐ(ఎం) పేదల పక్షాన పోరాడుతోందన్నారు. 2022లో ఇదే కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాతో.. రామోజీ యాజమాన్యం స్పందించి ప్రభుత్వంతో చర్యలు జరిపిందని తెలిపారు. ఈ చర్చల్లో.. సర్వే నెంబర్‌ 189, 203ల్లో భూమిని తమకు కేటాయిస్తే.. పేదలకు మరో ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి ఇచ్చేందుకు ప్రభుత్వానికి డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. రామోజీ యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు వెంటనే లబ్దిదారులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. కానీ నేటి వరకు అలాంటి ప్రయత్నాలు ఏమీ జరలేదని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే లబ్దిదారులకు కేటాయించిన సర్వే నెంబర్లలోనే ఇంటి స్థలాలు ఇచ్చి.. ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన కలెక్టర్‌ మంగళవారం రామోజీ యాజమాన్యాన్ని పిలిపించి ఆర్డీవో సమక్షంలో లబ్దిదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్‌, మండల కార్యదర్శి సిహెచ్‌ బుగ్గరాములు, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్‌ జంగయ్య, పంది జగన్‌, మండల కమిటీ సభ్యులు, బాధిత లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love