రంగన్న వెంటే

Ranganna Wente– కదంతొక్కిన పార్టీ శ్రేణులు…
– ఎరుపెక్కిన మిర్యాలగూడ…
– అడగడుగునా పూల వర్షం
– అశేష జనవాహినితో నామినేషన్‌ దాఖలు
– కమ్యునిస్టులను శాసనసభకు పంపాలి : సీపీఐ(ఎం) ఏపీ మాజీ కార్యదర్శి, మాజీ ఎంపీ పి మధు
– పోరాడే నాయకుడు రంగన్న : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
– ఇది ధనబలం, జనబలం మధ్య పోరాటం : రంగన్న
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడలో ఎర్రదండు కదిలింది. నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చి నినాదాలు చేస్తూ పురవీధుల్లో కదంతొక్కారు. సీపీఐ(ఎం) అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి నామినేషన్‌ సందర్భంగా శుక్రవారం భారీ ర్యాలీ జరుగుతున్న సమయంలో కార్మికులు, హమాలీలు, పూలు, పండ్ల వ్యాపారులు పూలమాలలతో ఎదురెళ్లి అయనకు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. జనాలతో ఇరువైపుల రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఐ(ఎం) ఏపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ పి. మధు మాట్లాడారు. దేశాన్ని దోచుకుతింటున్న మోడీకి వ్యతిరేకంగా, మతోన్మాద బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు పోరాడుతున్నారన్నారు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉండడం వల్లనే కేసీఆర్‌ వామపక్షాలతో స్నేహాన్ని వదులుకున్నాడని విమర్శించారు. బీజేపీని నివారించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌తో పొత్తుకు సమ్మతించినా.. వారికి లక్ష్యం పట్ల చిత్తశుద్ధి లేనందున పొత్తు కుదరలేదన్నారు. పార్టీ సత్తా ఏమిటో ఈ ఎన్నికల్లో చూపిస్తామని సవాల్‌ విసిరారు. ప్రజల కోసం పనిచేసే జూలకంటి రంగారెడ్డిని గెలిపించాలని కోరారు.
పేదల పక్షాన పోరాడే నాయకుడు రంగన్న : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
పేదల పక్షాన నిరంతరం రాజీలేని పోరాటాలు చేసే నాయకుడు జూలకంటి రంగారెడ్డి అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. పదవి ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసం పనిచేసే జూలకంటి రంగారెడ్డిని గెలిపిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. అమలుకు నోచుకోని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.
మోసగాళ్ల మాటలను నమ్మొద్దు : జూలకంటి
ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే మోసగాళ్ల మాటలను నమ్మొద్దని సీపీఐ(ఎం) అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు ప్రజలకు మాయమాటలు చెబుతూ ఓటు వేయించుకోవాలని చూస్తున్నారని, అలాంటి వారి మాటలను నమ్మితే భవిష్యత్తులో మోసపోతారని చెప్పారు.
వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, డబ్బు సంచులతో వచ్చి ఓట్లను కొని అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. మిర్యాలగూడలో ధన బలం, పోరాడే బలం మధ్య ఎన్నికల జరుగుతున్నాయని, ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఐదేండ్లు పాలించే ప్రజానాయకుడు ఎలా ఉండాలో మీరే తెలుసుకోవాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి వాడిలా అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని చెప్పారు తనకు ఓటు వేసి గెలిపిస్తే మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. దీనికి తోడు మహిళా డిగ్రీ కళాశాల మంజూరుకు పాటుపడతానన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మిర్యాలగూడ గౌరవాన్ని పెంచుతానన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్‌ నాయక్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌వీ రమ, నారి ఐలయ్య, డబ్బికార్‌ మల్లేష్‌, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రవి నాయక్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, సీఐటీయూ రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్‌, డాక్టర్‌ మల్లు గౌతమ్‌ రెడ్డి, భవాండ్ల పాండు, పాదురి శశిధర్‌ రెడ్డి, రాగిరెడ్డి మంగా రెడ్డి, పరుశురాములు, వరలక్ష్మి, వినోద్‌ నాయక్‌, సీతారాములు, గోవర్ధన, రొండి శ్రీనివాస్‌, బాల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love