రంజుగా సాగర్‌ పాలిట్రిక్స్‌

రంజుగా సాగర్‌ పాలిట్రిక్స్‌– రోజురోజూకీ పెరుగుతున్న గ్రూప్‌ వార్‌
– ఇదే సమయంలో అల్లు ఎంట్రీతో క్యాడర్‌లో కన్ఫ్యూజన్‌
– బీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ అంటూ ప్రచారం
– అవకాశం కోసం కాంగ్రెస్‌, బీజేపీల వెయిటింగ్‌
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల్లో టికెట్‌ కోసం పోటాపోటీగా ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో గ్రూప్‌ వార్‌ రోజురోజుకీ తారాస్థాయికి చేరుతోంది. వీలు చిక్కినప్పుడల్లా నేతలు తమ బలనిరూపణకు దిగుతున్న సందర్భాలు లేకపోలేదు. నియోజకవర్గంలో టికెట్‌ ఆశావహులు సామాజిక సేవా కార్యక్రమాలు, ఫౌండేషన్ల పేరుతో ప్రజల్లోకి వెళ్లి.. అధినాయకత్వం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సినీనటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నియోజకవర్గంలో పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గ్రూప్‌ వార్‌తో పెరిగిన ఆశావహులు..
నాగార్జునసాగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీలో గ్రూప్‌ వార్‌ పెరిగిపోయింది. ప్రధానంగా ఎమ్మెల్యే నోముల భగత్‌, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మధ్య వివాదం తీవ్రమైన సంగతి తెలిసిందే. వీరు కాకుండా నియోజకవర్గం నుంచి ఏకే ఫౌండేషన్‌ చైర్మెన్‌ కట్టెబోయిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బుసిరెడ్డి ఫౌండేషన్‌ చైర్మెన్‌ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్‌ యాదవ్‌ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎక్కువగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గ్రూపుల మధ్య వార్‌ పెద్దఎత్తున సాగుతోంది. సొంత నియోజకవర్గంలో పక్కోడి పెత్తనం ఏంటంటూ బహిరంగంగానే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలో 70 శాతం లోకల్‌ లీడర్లు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గ్రూపులోకి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.
పాగా వేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీల స్కెచ్‌..
సాగర్‌ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఉపఎన్నికలోనూ బీఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో మూడోసారీ బీఆర్‌ఎస్‌ పాగా వేయాలని భావిస్తోంది. సాగర్‌ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి మరోసారి పోటీ చేస్తారా..? లేక ఆయన తనయుడు కుందూరు జయవీర్‌ రెడ్డి పోటీ చేస్తారా..? అన్న సందిగ్ధత నెలకొంది. బీజేపీ నుంచి రిక్కల ఇంద్రసేనారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, గత ఉపఎన్నికలో పోటీ చేసిన రవినాయక్‌కు మరోసారి టికెట్‌ ఇవ్వడం కష్టమనే తెలుస్తోంది. అయితే, బీఆర్‌ఎస్‌లోని కుమ్ములాటలు తమకు కలిసొస్తాయని కాంగ్రెస్‌, బీజేపీ భావిస్తున్నాయి.
అల్లు ఎంట్రీతో సీన్‌ రివర్స్‌
నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి(సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ) సైతం బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల నియోజకవర్గంలో కేసీఆర్‌(కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి) ఫౌండేషన్‌ పేరుతో సేవా కార్యక్రమాలు విపరీతంగా చేపట్టారు. దీనికితోడు అల్లుడి సినీ గ్లామర్‌తోపాటు కంచర్లకు ఇక్కడ ఉన్న బంధువులు, స్నేహితులు తదితర అంశాలు కలిసొస్తాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో గతంలో ఆయనకు ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసిన అనుభవం కొంత కలిసొస్తుందని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా పెద్దవూరలో కంచర్ల కన్వెన్షన్‌ ప్రారంభోత్సవానికి సినీ నటుడు అల్లు అర్జున్‌ రావడం.. అది కూడా అసెంబ్లీ ఎన్నికల సీజన్‌ ముమ్మరవుతున్న వేళలో కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలే అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో నేతల మధ్య గ్రూప్‌ వార్‌తో సతమతమవుతున్న క్యాడర్‌ను కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఎంట్రీతో మరింతగా కన్ఫ్యూజన్‌లో పడేసిందనే చెప్పాలి.

Spread the love