‘రస’మయం..!

'Rasa' mayam..!ప్రస్తుతం సీజనల్‌ జ్వరాలు వ్యాపించి ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వరం బారిన పడుతూనే ఉన్నారు. దీని ప్రభావం వల్ల నోటికి ఏమీ రుచించదు. కానీ తినకుంటే ఇంకా నీరసించి పోతారు. అందుకే నోటికి కాస్త రుచిగా, ఏమైనా తినాలనిపించినా ఏది పడితే అది తినలేని పరిస్థితి. అలాంటి వారికి రసంతో భోజనం పెడితే నోటికి కాస్త రుచి అనిపించి తింటారు. ఈ రసాలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో రసాలు ఏ విధంగా చేస్తారో, ఆ వెరైటీలతో ఈ వారం రసాలు…
మైసూర్‌ రసం
కావాల్సిన పదార్థాలు : కందిపప్పు – మూడు చెంచాలు, చింతపండ – రెండు మీడియం సైజు నిమ్మ కాయంత, టొమాటోలు – నాలుగు, కొత్తిమీర – కట్ట, కొబ్బరి తురుము – నాలుగు చెంచాలు, ఉప్పు – సరిపడా
పొడి కోసం : ధనియాలు – మూడు చెంచాలు, ఆవాలు – అరచెంచా, జీలకర్ర – చెంచా, మెంతులు – చెంచా, ఎండుమిర్చి – నాలుగు, కరివేపాకు – ఆరు రెబ్బలు, మిరియాలు – అర చెంచా
తాలింపు కోసం : జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె – కొద్దికొద్దిగా
తయారుచేసే విధానం : ముందుగా కడా యిలో ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించి తీసి చల్లారనివ్వాలి. అదే కడాయిలో చెంచా నూనె వేసి ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగాక చల్లారనివ్వాలి. ఇప్పుడు అన్నీ కలిపి మెత్తగా పొడి చేయాలి. కందిపప్పును ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చింతపండును నానబెట్టి ఒకటిన్నర లీటర్ల రసం తీయాలి. ఈ రసాన్ని ఓ మందపాటి కడాయిలో పోసి మరిగించాలి. అందులో ఉడికించి మెదిపిన కందిపప్పు, సన్నగా కోసిన టొమాటోలు, రసం పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి పదినిమిషాలు మరిగించాలి. తర్వాత దించి తాలింపు చేసి కొబ్బరి తురుము వేసి మరిగించేస్తే సరి..
తెలంగాణ మామిడి రసం
కావాల్సిన పదార్థాలు : పచ్చి మామిడికాయలు – రెండు, ఉల్లిపాయ – ఒకటి, పచ్చిమిర్చి – నాలుగు, అల్లం వెల్లుల్లి – చెంచా, కరివేపాకు – రెండు రెబ్బలు, జీలకర్ర – పావు చెంచా, ఆవాలు – పావు చెంచా, ఎండుమిర్చి – మూడు, నూనె – రెండు చెంచాలు, ఉప్పు – తగినంత, పసుపు – పావు చెంచా.
తయారుచేసే విధానం : పచ్చిమామిడికాయల్ని నీళ్లలో వేసి ఉడికించాలి. వాటి నుంచి గుజ్జు తీసి అందులో సుమారు లీటరు నీళ్లు కలిపి పక్కన ఉంచాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగాక అల్లం వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పసుపు కూడా వేసి వేగాక తీసి ఉంచిన మామిడిరసంలో కలపాలి. చివరగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి కలిపి దించుకోవాలి. ఈ రసాన్ని మామిడికాయల సీజన్‌లో మాత్రమే చేసుకోగలం.
కావాల్సిన పదార్థాలు : ఉలవలు – కప్పు, చింతపండు – నిమ్మకాయంత, పచ్చిమిర్చి – మూడు, ఎండుమిర్చి – నాలుగు, కరివేపాకు – నాలుగు రెబ్బలు, జీలకర్ర – అర చెంచా, ఆవాలు – చెంచా, బెల్లం తరుగు – చెంచా.
పొడి కోసం : దనియాలు – చెంచా, జీలకర్ర – చెంచా, వెలుల్లి రేకలు – ఆరు.
తయారుచేసే విధానం : ఉలవల్ని ఒక రాత్రంతా నానబెట్టి ఎనిమిది కప్పుల నీటిలో మెత్తగా ఉడికించి వడకట్టాలి. తర్వాత అరకప్పు ఉలవలను మాత్రమే తీసుకుని పేస్టులా రుబ్బుకోవాలి. కడాయిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, వేయించి వడకట్టిన నీరు పోసి మరిగించాలి. ఒక పొంగు రాగానే పసుపు, ఉప్పు, బెల్లం, రసం పొడి, ఉలవల పేస్టు, చింతపండు గుజ్జు కలిపాలి. దీన్ని చిన్న మంటపై ఇరవై నిమిషాలు మరిగించాలి. వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
మద్రాసు రసం
కావాల్సిన పదార్థాలు : కందిపప్పు – యాభై గ్రా||., చింతపండు – పెద్ద నిమ్మకాయంత, టొమాటోలు – రెండు, కొత్తిమీర – ఒక కట్ట, కరివేపాకు – ఐదు రెబ్బలు
పొడి కోసం : ధనియాలు – మూడు చెంచాలు, మిరి యాలు – అరచెంచా, ఇంగువ – చిటికెడు, జీలకర్ర – పావు చెంచా, ఎండుమిర్చి – నాలుగు, శెనగపప్పు – మూడు చెంచాలు
తాలింపు కోసం : నూనె, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు అన్ని కొద్దికొద్దిగా
తయారుచేసే విధానం : కందిపప్పుని ఉడికించి మెత్తగా మెదపాలి. చింతపండు నానబెట్టి గుజ్జు తీసి అందులో ఓ గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. ఓ గిన్నెలో ఉడికించిన పప్పు, మరిగించిన చింతపండు రసం కలిపి చిన్నగా తరిగిన టొమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి కలపాలి. పొడి కోసం తీసుకున్నవన్నీ వేయించి పొడి చేసి రసంలో కలపాలి. ఇప్పుడు ఇందులో సుమారు రెండుపావు లీటర్‌ నీళ్లు పోసి సన్నని సెగమీద మరిగించాలి. అది బాగా మరిగిన తరవాత తాలింపు చేసి దించాలి.
ఆంధ్రా వెల్లుల్లి చారు
కావాల్సిన పదార్థాలు : చింతపండు- రెండు పెద్ద నిమ్మకాయలంత, ఉల్లిపాయలు – రెండు, వెల్లుల్లి – ఎనిమిది రెబ్బలు, కరివేపాకు – కట్ట, కొత్తిమీర – కట్ట, పసుపు – అర చెంచా, చెక్కెర – మూడు చెంచాలు, ఉప్పు – రుచికి తగినంత
తాలింపు కోసం : ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి – తగినన్ని
తయారుచేసే విధానం : సుమారు రెండు లీటర్ల నీళ్లలో చింతపండు రసం తీసి స్టవ్‌మీద పెట్టి మరిగిస్తూ ఉండాలి. విడిగా ఓ పాన్‌లో నూనె వేసి తాలింపు చేశాక అందులోనే చిదిమిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పసుపు, వేసి బాగా వేయించాలి. తర్వాత దీన్ని మరుగుతున్న చింతపండు రసంలో వేసి కలపాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి మరో పావుగంట మరిగించాక దించేముందు పంచదార, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము చేర్చి మరో ఐదు నిమిషాలు మరిగించి దించాలి.

Spread the love