ప్రత్యేక బోర్డుతోనే మిర్చికి రేటు

The rate of chilli is on a separate board– మిరప ధరల స్థిరీకరణకు ఇదో మార్గం
– సుగంధద్రవ్యాల బోర్డు నుంచి విడదీయాలని డిమాండ్‌
– రేటు తగ్గుతుండటంతో నిరసనల వెల్లువ
– మద్దతు ధర కోసం రైతుసంఘాల పోరాటం
– ఖమ్మంలో తెలంగాణ రైతు సంఘం మహాధర్నా
– క్వింటాకు రూ.25 వేలు ఇస్తేనే గిట్టుబాటు
‘ఓవైపు మిర్చికి పెట్టుబడులు పెరుగుతుండగా.. మరోవైపు ధరలు తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. క్వింటాకు రూ.25,000 ఉంటేనే కొంతమేర గిట్టు బాటు అవుతుందను కుంటున్న దశలో ఏటేటా ధరలు క్షీణిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మిర్చి రైతులు కన్నెర్రజేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి సాగవుతున్న దృష్ట్యా ఖమ్మం కేంద్రంగా మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఊపందుకుం టోంది. బోర్డు నెలకొల్పి మిర్చి ధరలు స్థిరీకరించాలని తెలంగాణ రైతు సంఘం నిర్వహిస్తున్న ఉద్యమాలకు పెద్ద ఎత్తున రైతుల నుంచి మద్దతు లభిస్తోంది.”
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మిర్చి రైతులు కన్నెర్ర చేస్తున్నారు. ఆరుగాలం కష్టం అంగట్లో సరుకులా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఎకరానికి రూ.3 లక్షల పెట్టుబడి పెడితే.. దానిలో సగం కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆందోళనలు చేపడుతున్నారు. ధరల స్థిరీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలకుపైగా మిరప వేస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1.25 లక్షల ఎకరాలు సాగవుతోంది. పైగా ఆంధ్రప్రదేశ్‌లోని పెద్ద మిర్చి మార్కెట్‌ గుంటూరుకు, తెలంగాణలోని వరంగల్‌కు అనుసంధానంగా ఉన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కేంద్రంగా మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని రైతులతో కలిసి తెలంగాణ రైతు సంఘం ఉద్యమాలు నిర్వహిస్తోంది. క్వింటాకు రూ.25 వేల గిట్టుబాటు ధర కోసం పోరాటాలు చేస్తోంది. ఆహార పంటల జాబితాలో మిర్చిని కూడా చేర్చాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే తెలంగాణ రైతు సంఘం మూడు పర్యాయాలు మిర్చి ధరలపై ఆందోళనలు నిర్వహించింది. ఖమ్మంలో మంగళవారం మహాధర్నా చేపట్టారు. రాష్ట్రంలోనే మిర్చి పంటకు ఖమ్మం జిల్లా కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇక్కడి తేజా రకం మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంది. ప్రతి ఏటా రూ.1500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు ఎగుమతులు జరిగేవి. కానీ, ఈ ఏడాది మాత్రం మిర్చి రైతులకు కన్నీళ్లే మిగిలాయి. రకరకాల చీడపీడలతో పంట దిగుబడి తగ్గిపోయింది. ఒకప్పుడు ఎకరానికి 40 క్వింటాళ్లు వచ్చిన దిగుబడి ఇప్పుడు 20 క్వింటాళ్లలోపే వస్తుంది. రేటు కూడా ఏటేటా తగ్గుతుండటంతో పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఎకరానికి కూలీలతో కలిపి రూ.3 లక్షల పెట్టుబడి పెడితే దానిలో సగం కూడా వచ్చేలా లేవు.
రూ. 25,500 నుంచి పడిపోయిన ధర
రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో మిర్చిని ఎక్కువగా సాగు చేస్తారు. 2023లో ఖమ్మం మార్కెట్‌లో రూ.25,500 పలికిన క్వింటా మిర్చి ఇప్పుడు రూ.11వేల నుంచి రూ.13 వేల వరకే అమ్ముడవుతోంది. జెండా పాట రూ.14 వేల చిల్లర పలుకుతోంది. ఒకట్రెండు లాట్లకు మాత్రమే ఈ రేటు పెడుతున్నారు. రైతుల అవసరాల దృష్ట్యా రూ.10 వేలకు అమ్ముకుంటున్నారు. కొన్నేండ్ల కింద ఒక్క ఖమ్మం జిల్లాలోనే 1.35 లక్షల ఎకరాల్లో మిర్చి సాగయ్యేది. ఈ ఏడాది 90 వేల ఎకరాల్లోనే పంట వేశారు. సీజన్‌ ప్రారంభంలో ఎక్కువగా కురిసిన వర్షాలతో తోటలు దెబ్బతిన్నాయి. ఒకటికి రెండు సార్లు మొక్కలు నాటుకోవాల్సి రావడంతో పెట్టుబడి ఖర్చులూ భారీగా పెరిగాయి. ఎరువులు, పురుగు మందులకు ఒక్కో రైతు ఎకరానికి రూ.1.50 లక్షలకు పైగా ఖర్చు పెట్టాడు. ఇంత చేసినా దిగుబడి మాత్రం అంతంత మాత్రమే వచ్చింది. ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే మిర్చి తోటలు, ఈ ఏడాది 10 క్వింటాళ్లలోపే వచ్చాయి. దిగుబడి కూడా ఆశాజనకంగా లేకపోవడంతో రైతుకు కన్నీళ్లే దిక్కయ్యాయి. అటు రేటు లేక ఇటు దిగుబడి తగ్గటంతో ఈ సీజన్‌లో ఒక్క ఖమ్మం జిల్లాలోనే నలుగురు మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
మిర్చి బోర్డు ఏర్పాటుకు డిమాండ్‌
వ్యాపారులు, ట్రేడర్లు అంతర్జాతీయ ఆర్డర్లు లేకపోవడంతోనే రేటు తగ్గుతుందని అంటున్నారు. ధరలు పతనం దృష్ట్యా వాణిజ్య పంట అయిన మిర్చికి మిగిలిన కమర్షియల్‌ క్రాప్స్‌ తరహాలోనే ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం సుగంధ ద్రవ్యాల్లో భాగంగా ఉన్న మిర్చి బోర్డు కేరళలో ఉంది. మిరపను స్పైసీ బోర్డు నుంచి విడదీసి పసుపు, పొగాకు తరహాలో ప్రత్యేక బోర్డుగా ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేస్తోంది. పసుపు, పొగాకు, ఆయిల్‌ పామ్‌లకు సంబంధించి ధరల స్థిరీకరణకు నేషనల్‌ టర్మరిక్‌ బోర్డు, టొబాకో బోర్డు, ఆయిల్‌ ఫెడ్‌ పర్యవేక్షణ చేస్తున్నాయి. పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ ఉంది. కానీ మిర్చికి ఎటువంటి ప్రత్యేక బోర్డు లేకపోవడం లోపంగా ఉంది. మార్క్‌ఫెడ్‌ కందులు, మొక్కజొన్నలు, పెసలు వంటి ఆహార పంటలను కొనుగోలు చేస్తోంది. కారం లేకుండా ఏ కూరనూ తినలేము కాబట్టి ఆహార పంటల జాబితాలో మిరపను చేర్చి గిట్టుబాటు ధరలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది. ప్రస్తుతం మిర్చి ధరలు బాగా పతనమవుతున్న దృష్ట్యా మార్క్‌ ఫెడ్‌, నాఫెడ్‌లను రంగంలోకి దించి కనీస ధర రూ. 25 వేలకు తగ్గకుండా కొనుగోళ్ళు జరపాలని తెలంగాణ రైతుసంఘం డిమాండ్‌ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మిర్చి ధర రూ.15వేలకు తగ్గకుండా కొనుగోలు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీ నిలుపుకోవాలని కోరుతోంది.

Spread the love