అర్హులందరికీ రేషన్‌కార్డులు

Ration cards for all eligible– ఎలక్షన్‌ కోడ్‌ లేని జిల్లాల్లో ఇచ్చేయండి
– పౌరసరఫరాలశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోలేని జిల్లాల్లో వెంటనే కార్డులు ఇచ్చేయాలని చెప్పారు. కోడ్‌ ముగిసిన వెంటనే ఇతర జిల్లాల్లోనూ సత్వరం రేషన్‌కార్డుల జారీకి ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, కులగణన సందర్భంగా ఇచ్చిన సమాచారం, గ్రామ సభలు, మీ-సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ వేగంగా పరిశీలించే ప్రక్రియను పూర్తిచేయాలని చెప్పారు. అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారంనాడిక్కడి కమాండ్‌ కంట్రోల్‌ రూంలో పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త రేషన్‌కార్డుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశ మిచ్చినప్పటికీ, మీ-సేవా కేంద్రాల వద్ద రేషన్‌ కార్డుల కోసం ఎందుకు రద్దీ ఉంటుందని ఆయన అధికారుల్ని ప్రశ్నించారు. దీనిపై వారు స్పందిస్తూ దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ మళ్లీ చేస్తున్నాయనీ, అందువల్లే రద్దీ ఎక్కువగా ఉంటున్నదని వివరణ ఇచ్చారు. దరఖాస్తులు వచ్చిన వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను ఆయన పరిశీలించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శి దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love