– రాష్ట్ర సర్కారుకు వెల్లువెత్తుతున్న అర్జీలు
– ఇప్పటివరకు ప్రజావాణికి 5,23,940 దరఖాస్తులు
– ఇప్పటిదాకా పరిష్కరించినవి 4,31,348
– ఇంకా మిగిలి ఉన్నవి 92592
– ప్రజాభవన్‌కు నేరుగా వచ్చినవి 60 వేలు
– గణాంకాలు విడుదల చేసిన సమాచార పౌర సంబంధాల శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడం నిరంతరాయంగా సాగుతున్నది. 50 వారాల్లో 5,23,940 దరఖాస్తులు అందాయి. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్‌లో మంగళ, శుక్రవారాల్లో జరుగుతున్న కార్యక్రమానికి 60 వేల అర్జీలు వచ్చాయి. ‘మాకు రేషన్ కార్డు ఇప్పించండి’…’మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టించండి’…’మాకు ఉపాధి అవకాశం కల్పించండి’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. మనిషి జీవనయానంలో కూడూ, గూడూ, ఉపాధి ఎంత ఆవశ్యకమనే విషయాన్ని ఆ అర్జీలు ఎత్తిచూపుతున్నాయి. ప్రభుత్వ విధానపర నిర్ణయాలు, కోర్టుల పరిధిలోని అంశాలు మినహా ప్రజల నుంచి వచ్చిన అర్జీలన్నింటినీ ప్రజాభవన్‌లోని ఆయా శాఖల విభాగాలు అక్కడికక్కడే పరిశీలిస్తున్నాయి. పరిషర్కిరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటిదాకా 4,31,348 పరిష్కారం అయినట్టు రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఇంకా 92,592 పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ గణాంకాలను వెల్లడించింది. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రజాభవన్‌లో నోడల్ ఆఫీసర్ దివ్య, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మెన్ చిన్నారెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అర్జీలు రాయలేని వారికి, ఎక్కడ ఇవ్వాలో తెలియనివారికి సహకరించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. హెల్త్‌తో పాటు అన్ని సంక్షేమ విభాగాల నుంచి అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారులు ప్రజావాణి డెస్కుల్లో అందుబాటులో ఉంటున్నారు. ఆరోగ్యశ్రీ జనరల్ మేనేజర్ అధ్వర్యంలో ఒక డెస్కు పనిచేస్తున్నది. అత్యవసర సేవల నిమిత్తం మెడికల్ హెల్ప్ డెస్క్, అంబులెన్స్ సిద్ధంగా ఉంటున్నాయి. మహిళా బాధితులకు తోడుగా ఉండేందుకు సఖి వాహనం, పిల్లలకు బాలారక్ష అంబులెన్స్లు ఇక్కడే ఉంటాయి. దివ్యాంగుల అర్జీల స్వీకరణకు ప్రత్యేక డెస్కు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను, వినతులను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలకు భోజనానికి ఇబ్బంది కలుగకుండా రూ.5 కే భోజనం సౌకర్యాన్ని సమకూర్చారు. ప్రజావాణిలో ఇచ్చే ప్రతి దరఖాస్తును అక్కడే స్కాన్ చేసి రిఫరెన్స్ ఐడీ నెంబర్ నమోదు చేసి సంబంధిత విభాగానికి పంపిస్తున్నారు. అర్జీదారుని ఫోన్ నెంబర్‌కు ఆ పిటిషన్‌కు సంబంధించిన రిఫరెన్స్ ఐడీ నెంబర్ ఎస్‌ఎంఎస్ చేస్తున్నారు. ఒకవేళ ఒకే అర్జీదారుడు ఒకే వినతిపై రెండు మూడు సార్లు ప్రజావాణికి వస్తే తెలిసిపోయేలా ఆన్‌లైన్ విధానం అమల్లో ఉంది. అర్జీదారు మొబైల్ నెంబర్ నమోదు చేయగానే తన పిటిషన్ స్కాన్డ్ కాపీ అక్కడ ప్రత్యక్షమవుతున్నది. దీంతో ఆ విజ్ఞప్తి ఏ స్థాయిలో ఉందో అర్జీదారులకు తెలియజేసి అధికారులు పంపిస్తున్నారు. దరఖాస్తుల స్టేటస్ ఏ దశలో ఉందో తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేను అధికారులు నిర్వహించేవారు. వేలాది మంది బాధితులు ప్రతి వారం దాని చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. జిల్లాల్లో పరిష్కారం కాని అర్జీలను రాష్ట్ర స్థాయిలో చెప్పుకునే వెసులుబాటు లేకుండా ప్రభుత్వం నియంత్రించింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది.