12 వికెట్ల‌తో ర‌వీంద్ర‌ జ‌డేజా విజృంభ‌ణ‌…

నవతెలంగాణ – హైదరాబాద్: ర‌వీంద్ర జ‌డేజా మాత్రం బౌలింగ్‌లో స‌త్తాచాటాడు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సౌరాష్ట్ర జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. పంత్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ ఢిల్లీ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో జ‌డ్డూ మొత్తం 12 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొద‌టి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన అత‌డు… రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు సాధించాడు. దీంతో ఢిల్లీపై సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ఇక ఢిల్లీ జ‌ట్టులో ఉన్న పంత్‌పై అంద‌రి క‌ళ్లు ఉండ‌గా… అత‌డు మాత్రం మ‌రోసారి ఫెయిల్ అయ్యాడు. మొద‌టి ఇన్నింగ్స్ లో 1 ప‌రుగుకే పెవిలియ‌న్ చేరిన అత‌డు.. రెండో ఇన్నింగ్స్ లో 17 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో జ‌డ్డూ (5 వికెట్లు) దెబ్బ‌కు ఢిల్లీ 188 ర‌న్స్‌కే ప‌రిమిత‌మైంది. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర 271 ప‌రుగులు చేసింది. దీంతో ఆ జ‌ట్టుకు 83 ప‌రుగుల ఆధిక్యం ద‌క్కింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీని మ‌రోసారి జ‌డేజా ఘోరంగా దెబ్బ తీశాడు. 38 ప‌రుగులు ఇచ్చి 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దాంతో ఢిల్లీ జ‌ట్టు కేవ‌లం 94 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. సౌరాష్ట్ర ముందు 12 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఆ టార్గెట్‌ను సౌరాష్ట్ర వికెట్ న‌ష్ట‌పోకుండా ఛేదించింది. రెండు ఇన్నింగ్స్ ల‌లో క‌లిపి 12 వికెట్లు తీసిన జ‌డ్డూకు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ద‌క్కింది. కాగా, జ‌డేజాకు ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 5 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం ఇది 36వ సారి.

Spread the love