నవతెలంగాణ – హైదరాబాద్: విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడం, స్వతంత్య్రంగా చదివే పాఠకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పఠనోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించింది. సోమవారం నుంచి జూలై 31 వరకు బడుల్లో రీడింగ్ క్యాంపెయిన్‌ను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శనివారం ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. 1వ తరగతి విద్యార్థులు సరళ పదాలు, 2వ తరగతి విద్యార్థులు ద్విత్వ, సంయుక్తాక్షర పదాలు, వ్యాక్యాలను ధారాళంగా చదివేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. 3వ ఆపై తరగతుల విద్యార్థులు అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలతోపాటు కథల పుస్తకాలు, బాల సాహిత్యాన్ని, వార్తాపత్రికలను ధారాళంగా చదివేలా తీర్చిదిద్దాలను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఐదువేల బడుల్లో గ్రంథాలయాలను ప్రారంభించారు. వీటిల్లో అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో పెట్టారు. రీడింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా రోజుకొక పీరియడ్‌ను కేటాయించి చదివించాలని ఆదేశాలిచ్చారు.