కరెన్సీ మారకపు రేటు – నిజ వేతనాలు

         పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యలోటును తగ్గించడానికి ఒకానొక దేశం తన కరెన్సీ మారకపు విలువను తగ్గించుకుంటే, దాని పర్యవసానంగా కార్మికుల నిజవేతనాలు అనివార్యంగా పడిపోతాయి. ఈ వాస్తవాన్ని చాలామంది ఆర్థిక నిపుణులు సైతం గ్రహించడం లేదు. ఇక మామూలు ప్రజానీకానికి అవగతం అయే పరిస్థితి ఎక్కడుంటుంది? ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ తన వాణిజ్యంలో ఎగుమతులకు, దిగుమతులకు మధ్య ఉన్న తేడాను తగ్గించుకోవాలంటే ఎగుమతులను బాగా పెంచాలి. అందుకోసం అంతర్జాతీయ మార్కెట్‌లో తను పోటీ పడగల సామర్ధ్యాన్ని పెంచుకోవాలి. అందుకోసం తన సరుకుల విలువను తగ్గించుకోవాలి. అంటే తన కరెన్సీ మారకపు రేటును తగ్గించు కోవాలి. దాని వలన పెట్టుబడి దారులు నష్టపోకుండా ఉండాలంటే దేశంలో కార్మికుల నిజవేతనాల స్థాయిని తగ్గించాలి. ముందు కరెన్సీ మారకపు రేటును తగ్గిస్తే అప్పుడు అది కార్మికుల నిజవేతనాలను కుదించడానికే దారి తీస్తుంది.
ఈ వాస్తవాన్ని అర్థశాస్త్రానికి సంబంధించిన చాలా పాఠ్యగ్రంథాలు ఎక్కడా చెప్పవు. సాధారణంగా ఆ పుస్తకాలను బూర్జువా అర్ధశాస్త్ర కోణం నుండే రాస్తారు. అందులో చిత్రించే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నమూనా వాస్తవంలో ఎక్కడా ఉనికిలో ఉండదు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే కొన్ని మార్కెట్ల సమూహంగా ఆ గ్రంథాలు పరిగణిస్తాయి. ఆ మార్కెట్లలో ధరలు పెరిగితే సరుకులకు ఉండే అదనపు డిమాండ్‌ తగ్గుతుంది అని చెప్తారు. విదేశీ మారకానికి సంబంధించిన మార్కెట్‌ను సైతం వారు ఆ విధంగానే చూస్తారు. ఆ మార్కెట్‌లో విదేశీ కరెన్సీకి ఎక్కువ డిమాండ్‌ ఉంటే దానిని తగ్గించడానికి మన దేశీయ కరెన్సీ మారకపు రేటును తగ్గించడం పరిష్కారం అని చెప్తారు. మన కరెన్సీ మారకపు రేటును తగ్గించడం అంటే విదేశీ కరెన్సీ మారకపురేటును పెంచడమే అవుతుందని, ఆ విధంగా విదేశీ కరెన్సీ మారకపు రేటు గనుక పెరిగితే ఆటోమేటిక్‌గా ఆ విదేశీ కరెన్సీకి డిమాండ్‌ తగ్గిపోతుందని వారు చెప్తారు. అప్పుడు వాణిజ్య లోటు కూడా తగ్గుతుందని చెపుతారు.
ఈ విశ్లేషణ యావత్తూ లోపభూయిష్టంగా ఉంది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలకు చమురు, సహజవాయువు వంటి ముడి పదార్థాలు దిగుమతులద్వారా రావలసివుంటుంది. చమురు ఉత్పత్తి చేసే దేశాలకు తమవద్ద పండని ఇతర ముడి పదార్థాలు దిగుమతులద్వారానే లభిస్తాయి. అలా దిగుమతులద్వారా సమకూరిన ముడి పదార్థాలకు దేశీయంగా లభించే ఇతర ముడి పదార్ధాలను, కార్మికుల శ్రమను కూడా జత చేస్తే అవి మొత్తం పరిశ్రమకు అవసరమైన ఇన్‌పుట్‌ అవుతుంది. అన్ని పెట్టుబడిదారీ దేశాలలోనూ, సరుకుల ధరలను నిర్ణయించేటప్పుడు ఈ ఇన్‌పుట్‌ కు అవసరమైన ఖర్చును లెక్కించి దానికి అదనంగా తమ లాభాన్ని జోడిస్తారు. ఇది గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థకు వర్తిస్తుంది. బడా పారిశ్రామిక గుత్త సంస్థలన్నీ ఈ విధంగానే తమ సరుకుల ధరలను నిర్ణయించి, ఆ రేటుకు తమ సరుకులను అమ్మితే ఎంత డిమాండ్‌ ఉంటుందో అంచనా వేసి ఆమేరకు తమసరుకులను ఉత్పత్తి చేస్తారు. పెట్టుబడిదారీ విధానం మొదటినుంచీ ఇదే మాదిరి పద్ధతిలో నడిచేదని కొందరు వాదిస్తూంటారు. మరికొందరు సాంప్రదాయ పెట్టుబడిదారీ ఆర్థిక శాస్త్రంలో స్వేచ్ఛాయుతమైన పోటీ నెలకొనివుండి, సరుకుల రేట్లను మార్కెట్‌లో ఉండే పోటీయే నిర్ణయిస్తుంది తప్ప వ్యక్తులు నిర్ణయించరు అని చెప్తారు. అయితే ఇక్కడ ఈ చర్చ ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఇక్కడ మౌలికమైన విషయం ఏమంటే ఏ ఆధునిక ఆర్థిక వ్యవస్థలోనైనా, సరుకుల ధరలను బడా కార్పొరేట్‌ సంస్థలు నిర్ణయిస్తాయి. తాము ఇన్‌పుట్స్‌ నిమిత్తం చేసిన ఖర్చుకు అదనంగా తమ లాభాన్ని కలిపి ఆ ధరలను నిర్ణయిస్తాయి.
ఇప్పుడు ఒక కరెన్సీ విలువను 10శాతం మేరకు తగ్గించారనుకుందాం. అప్పుడు దిగుమతి చేసుకున్న విదేశీ సరుకుల విలువ ఈ దేశంలో 10శాతం మేరకు పెరుగుతుంది. ఆ సరుకులను ఇన్‌పుట్స్‌గా వాడి చేసే ఉత్పత్తుల విలువలో ఆ మేరకు (దిగుమతి చేసుకున్న సరుకులను వాడినమేరకు) 10శాతం పెరుగుదల ఉంటుంది. కార్మికుల నిజవేతనాలు యధాతథంగా కొనసాగాలంటే అప్పుడు ఆ వేతనాలు డబ్బు రూపంలో(ప్రస్తుత డబ్బు విలువ ప్రకారం) 10శాతం పెరగాల్సి ఉంటుంది. అప్పుడు ఆ సరుకుల ధరలు కూడా స్థానికంగా 10శాతం మేరకు పెరుగుతాయి. అటువంటప్పుడు కరెన్సీ విలువను 10శాతం తగ్గించినందువలన వాణిజ్య లోటులో ఏ విధంగానూ మార్పు ఉండదు.
కరెన్సీ విలువ 10శాతం మేరకు తగ్గి, దాని పర్యవసానంగా సరుకుల దేశీయ ధరలు 10శాతం పెరిగినప్పుడు విదేశీ మారకంలో ఆ సరుకుల ధరలు ఏ మార్పూ లేకుండా యథాతథంగా ఉంటాయి. అప్పుడు ఎగుమతులలో పెరుగుదల ఏమీ ఉండదు. సరుకుల ధరలు విదేశీ కరెన్సీలో తగ్గితేనే వాటి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా కరెన్సీ విలువ 10శాతం తగ్గిన ఫలితంగా దేశీయ ధరలు 10శాతం పెరిగితే, అప్పుడు దిగుమతి చేసుకునే విదేశీ సరుకుల ధరలు కూడా 10శాతం పెరుగుతాయి. అదే సమయంలో ఇతర స్థానిక సరుకుల ధరలు కూడా 10శాతం పెరుగుతాయి. అందుచేత దిగుమతులు తగ్గిపోవడం అనేది జరగదు. అంటే నిజవేతనాల విలువలు యథాతథంగా కొనసాగినంతకాలం, కరెన్సీ మారకపు రేటును తగ్గించినందువలన ఎగుమతులు పెరేది ఏమీ ఉండదు, అదే విధంగా దిగుమతులు తగ్గేదీ ఏమీ ఉండదు. వాణిజ్యలోటు అంతకు మునుపు ఏ విధంగా ఉండిందో, అదే మోతాదులో ఇప్పుడూ కొనసాగుతుంది.
అందుచేత కరెన్సీ మారకపు రేటు తగ్గించినందువలన వాణిజ్యలోటు తగ్గాలి అంటే, అందుకు ఎగుమతులు పెరగాలి. అంటే తప్పనిసరిగా దేశీయ సరుకుల ధరలు (దేశీయ కరెన్సీలో) పెరగకుండా యధాతథంగా కొనసాగాలి. అవి అలా కొనసాగాలి అంటే కార్మికులకు చెల్లించే వేతనాలు (అప్పటి డబ్బు రూపంలో) పెరగకుండా యధాతథంగా కొనసాగాలి. అంటే వాటి నిజవేతనాల విలువ తగ్గాలి.
ఇదెలాగోచూద్దాం… వాణిజ్యలోటును తగ్గించడానికి కరెన్సీ మారకపు రేటును 10శాతం తగ్గించారు అనుకుందాం. దాని వలన ప్రయోజనం ఉండాలంటే దేశీయంగా ధరలు 10శాతం పెరిగితే ఏ ప్రయోజనమూ ఉండదు (ఈ విషయాన్ని ముందే వివరించాను). కనుక దేశీయంగా సరుకుల ధరలలో పెరుగుదలను అంతకన్నా తక్కువ మోతాదులో, ఉదాహరణకి 7శాతం మేరకు పరిమితం చేయవలసివుంటుంది. ఏదైనా సరుకు తయారీకి అయే ఖర్చులో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది దాని తయారీలో వినియోగించబడిన కార్మికుల శ్రమకు అయే ఖర్చు, రెండవది, ఆ సరుకు తయారీలో ఉపయోగించిన విదేశీ ఇన్‌పుట్స్‌ ఖర్చు (సరుకు తయారీలో దేశీయంగా లభించే ఇన్‌పుట్స్‌ కూడా ఉంటాయి. అయితే వాటి ధరలు సరుకు అంతిమంగా అమ్ముడుపోయే రేటు ఏ మేరకు పెరుగుతుందో ఆ నిష్పత్తిలోనే పెరుగుతాయి గనుక వాటిని ఇక్కడ పరిగణనలోకి తీసుకోనవసరం లేదు). సరుకు తయారీలో వాడే విదేశీ ఇన్‌పుట్స్‌ ధర 10శాతం పెరుగుతుంది. కాబట్టి కార్మికుల శ్రమకు 7శాతం కన్నా తక్కువ ఖర్చు అయినప్పుడే సరుకు అంతిమ ధరను 7శాతానికి పరిమితం చేయడం సాధ్యపడుతుంది. అందుచేత కార్మికులకు డబ్బు రూపేణా చెల్లించే వేతనాలలో పెరుగుదలను 5శాతానికే పరిమితం చేయవలసివుంటుంది. ధరలు 7శాతం పెరిగి కార్మికుల వేతనాలు 5శాతం మాత్రమే పెరగడం అంటేనే వారి నిజవేతనాలు తగ్గిపోవడం.
కరెన్సీ మారకపు రేటును తగ్గించడం ద్వారా అటు విదేశీ వాణిజ్యలోటు తగ్గాలని, ఇటు కార్మికుల నిజవేతనాలు పడిపోకుండా యధాతథంగా కొనసాగాలని అనుకుంటే అందుకు ఒకటే మార్గం ఉంది. పెట్టుబడిదారులు తమ లాభాలను తగ్గించుకోవడమే ఆ మార్గం. కాని పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు తమ లాభాలను తగ్గించుకోవడం అనేది జరగని పని. కాబట్టి కరెన్సీ మారకపు రేటును తగ్గించడం అంటే కార్మికుల నిజవేతనాలను తగ్గించడమే.
ఆ విధంగా తమ నిజవేతనాలు తగ్గినా కార్మికులు ఆ చర్యను ప్రతిఘటించేంత బలంగా లేరనుకుందాం. అప్పుడు వాణిజ్యలోటు తగ్గాలి కదా! కాని గ్యారంటీగా వాణిజ్యలోటు తగ్గుతుందని చెప్పలేం. వాణిజ్యలోటు తగ్గాలంటే దేశీయంగా ఉపాధికల్పన పెరగాలి, దేశీయంగా ఉత్పత్తి పెరగాలి. ఆ విధంగా పెరిగిన ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మి మన వాణిజ్యలోటును తగ్గించుకోవడం జరగాలి. మనదేశంలో ఉత్పత్తి పెరిగి అది అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముడుపోవడం అంటే వేరే ఏవో దేశాలలో ఉత్పత్తి అయిన సరుకు ఆ మేరకు అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముడుపోకుండా ఉండడం. అంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ఇతరదేశాల వాటా తగ్గి మనదేశ వాటా పెరిగినప్పుడే మన వాణిజ్యలోటు తగ్గుతుంది. దానికి ప్రతిస్పందనగా ఆ దేశాలు కూడా తమ తమ కరెన్సీల మారకపు రేట్లను తగ్గించుకుంటే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ వాణిజ్యలోటు మొదటికే వస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడుతున్న దేశాలు తమ తమ కరెన్సీ మారకపు రేట్లను తగ్గించుకుంటే అప్పుడు ఆ యా దేశాలలోని కార్మికుల నిజ వేతనాలు కూడా పడిపోతాయి. దేశంలో ఆదాయాల పునఃపంపిణీ జరిగి కార్మికుల ఆదాయాలు పెరిగే విధానాలను ప్రభుత్వాలు చేపట్టకుండా, తద్వారా దేశీయంగా కొనుగోలుశక్తిని పెంచకుండా కేవలం కరెన్సీ మారకపు రేటును తగ్గించడానికే పరిమితం అయితే కార్మికుల శ్రమను మరింత చౌకగా పిండుకోవడం తప్ప వేరేమీ జరగదు.
ఒకానొక దేశం కరెన్సీ మారకపు రేటును తగ్గించి తద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో తన ఉత్పత్తులను మరింత ఎక్కువగా అమ్ముకోడానికి, తద్వారా వాణిజ్యలోటు తగ్గించుకోడానికి ప్రయత్నించి ఆ క్రమంలో తన దేశంలో మరింత ఎక్కువమందికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నించడం అంటే పొరుగుదేశాలను మరింత వెనక్కినెట్టి తాను ముందుకు పోవాలన్న ప్రయత్నమే. ఈ మాదిరి విధానాన్ని అమలు చేసినపెట్టుబడిదారీ దేశాలలో అదనంగా ఉద్యోగాలు ఎక్కడా కల్పించడం అన్నది జరగలేదు కాని అక్కడి కార్మికుల నిజవేతనాలు మాత్రం పడిపోయాయి.
అక్కడితో ఇది ఆగదు. కొన్ని సందర్భాలలో నిజవేతనాలు పడిపోయినందువలన కార్మికుల కొనుగోలు శక్తి తగ్గిపోయి, దేశం మొత్తం మీద డిమాండ్‌ తగ్గిపోతుంది. అప్పుడు సరుకుల ఉత్పత్తి తగ్గుతుంది. దాని పర్యవసానంగా ఆ సరుకుల తయారీలో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఆ విధంగా పొరుగుదేశాలను వెనక్కి నెట్టి తాను మాత్రం ముందుకు పోవాలన్న తాపత్రయం ప్రదర్శించే పెట్టుబడిదారీ దేశాలన్నీ అంతకు మునుపు ఉన్న స్థితి కన్నా ఇంకా కిందకి దిగజారిపోతాయి. పెట్టుబడిదారీ విధానం ఎంత అర్థం లేనిదో దీనిని బట్టి విదితమవుతుంది.
ఈ మాదిరి అనుభవాలు 1930 దశకంలో చాలా ఉన్నప్పటికీ, వాటినుండి నేర్చుకోకుండా ఇప్పుడు మళ్ళీ డాలర్‌ మారకపు రేటును తగ్గించి అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయాలన్న డిమాండ్‌ అమెరికాలో వినవస్తోంది.
– ప్రభాత్‌ పట్నాయక్‌
 (స్వేచ్ఛానుసరణ)

Spread the love