– అసైన్డ్ భూముల్లో వెంచర్లు
– అమాయక ప్రజలకు అమ్మకాలు
– రిజిస్ట్రేషన్ చెయ్యకుండా నోటరీలతో సరి
– ఇంటి నిర్మాణాలను కూల్చేస్తున్న రెవెన్యూ అధికారులు
– సర్కారు భూముల్లో నిర్మాణాలు చేపడితే ఊరుకోబోమని హెచ్చరిక
– మోసపోయామని గ్రహించిన వట్టినాగులపల్లి బాధితులు
– వారికి అండగా నిలిచిన వ్యకాస
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పేదలు ఓ మోసకారి వలకు చిక్కారు.. వాడి మాటలు నమ్మి లక్షలు వెచ్చించి జాగాలు కొన్నారు. ఇండ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో ప్రభుత్వ అధికారులు వచ్చి ఇండ్లను కూల్చేశారు. ఇది తెలిసి ఆ మోసకారి.. న్యాయం చేస్తానని మళ్లీ బాధితుల వద్ద డబ్బులు వసూలు చేశాడు. పేదలు గుడిసెలు వేయడం.. అధికారులు కూలగొట్టడం.. ఇదే అదనుగా ఆ మోసకారి డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఈ విషయం తెలుసుకున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించగా విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చివరికి.. దారుణంగా మోసపోయామని బాధితులు గ్రహించారు. బాధితులకు వ్యకాస రాష్ట్ర బృందం అండగా నిలిచింది. బాధ్యులపై చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. రియల్టర్ల మోసాలకు బలైన వట్టినా గులపల్లి బాధితులపై నవతెలంగాణ క్షేత్రస్థాయి కథనం.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భూముల ధరలు రూ.కోట్లలో ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ పాగా వేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత విలువైన గండిపేట మండలంలోని కోకాపేట భూములకు కనుచూపు మేరలోని వట్టినాగులపల్లి రెవెన్యూ పరిధిలో గల అసైన్డ్ భూముల్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ వేశాడు. పేద ప్రజలకు విక్రయించి వారిని అప్పులపాలు చేశాడు. వట్టినాగులపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 130/3, 130/4లో సుమారు 4.20 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. రైతుల దగ్గర నుంచి జావేద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశాడు. అందులో 2016లో 130 ప్లాట్లతో వెంచర్ చేశాడు. ఒక్కో ప్లాట్ 120 గజాల విస్తీర్ణంతో చేశాడు. ఒక్కో ప్లాట్‌ను సుమారు రూ.3 నుంచి 5 లక్షల వరకు పేదలకు విక్రయించాడు. తక్కువ ధరకు ఇంటి జాగా వస్తుందన్న ఆశతో వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన కార్మికులు కొనుగోలు చేశారు. అయితే, ఈ భూమి అసైన్డ్ భూమి కావడంతో రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేదు. అమాయక ప్రజలను బురిడీ కొట్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నోటరీ డాక్యుమెంట్ ద్వారా ప్లాటు విక్రయించాడు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు 2016లో నిర్మాణాలు చేపట్టారు. ఇండ్లకు అప్పటి అధికారులు ఇంటి నెంబర్లు, కరెంట్ మీటర్లు కూడా ఇచ్చారు. కానీ కొన్ని రోజులకు ఈ జాగాలు ప్రభుత్వానికి చెందినవి అని అధికారులే ఇండ్లను కూల్చేశారు. దీంతో నోటరీదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆశ్రయించగా.. మాయమాటలు చెప్పి మరోసారి గూడిసెలు వేయించే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో ప్రభుత్వ జాగాల్లో ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న పేదలకు 58, 59 జీవో ప్రకారం పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి జావేద్ మరోమారు బాధితుల నుంచి రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి ఒక్కో ప్లాట్‌కు రూ.50వేల నుంచి లక్ష వరకు వసూలు చేశాడు. కానీ రెగ్యులరైజ్ చేయించలేదు. ఈలోపు ఈ నెల 16వ తేదీన మళ్లీ అధికారులు గుడిసెలు కూల్చేశారు. అప్పటి నుంచి మాయమైన జావేద్.. ఇటీవల బాధితులు ఆ జాగాల్లో గుడిసెలు వేసేందుకు వెళ్తే.. ప్లేట్ ఫిరాయించి ఇక్కడ గుడిసెలు వేయడానికి వీల్లేదని బాధితులను అడ్డుకున్నాడు. ఒక్కో ప్లాటుకు రూ.10లక్షలు చెల్లిస్తేగానీ జాగాల్లో అడుగుపెట్టేది లేదని పోలీసు బలాగాలతో వచ్చి బెదిరించాడని బాధితులు ఆరోపించారు. జావేద్ చేతిలో తాము మోసపోయామని బాధిత పేదలు గ్రహించారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరారు.
బాధితులకు అండగా వ్యకాస
బాధితుల గుడిసెలను అధికారులు కూలగొట్టిన విషయం తెలుసుకున్న వ్యవసాయ కార్మిక సంగం రాష్ట్ర నేతలు బాధితులను పరామర్శించారు. వారికి అండగా నిలిచారు. బుధవారం నేతలు వట్టినాగులపల్లిలో పర్యటించి, వాస్తవాలపై ఆరా తీశారు. రియల్టర్ల చేతిలో బాధితులు మోసపోయారని గుర్తించారు. అనంతరం బాధితులతో కలిసి గండిపేట తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని భరోసానిచ్చారు.
పేద ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయాలి
జి.నాగయ్య, వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు
రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతుల్లో మోసపోయిన అమాయక ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయాలి. నోటరీ ద్వారా కొనుగోలు చేసిన ఇంటి జాగాలకు.. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేసి జీవో 186 ద్వారా పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే, రియల్ ఎస్టేట్ వ్యాపారి జావేద్‌ను వెంటనే అరెస్టు చేయాలి. లేనిపక్షంలో వ్యకాస ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతాం.
రియల్ వ్యాపారులపైచర్యలు తీసుకోవాలి
వెంకట్రాములు,వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పేదలను మోసం చేసి సొమ్ము చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి జావేద్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధితులకు న్యాయం చేయాలి.