కరెంటు బిల్లు రూ.4,950.. కస్టమర్‌కు రూ.197 కోట్లకు రసీదు..!

నవతెలంగాణ – గోరఖ్‌పూర్‌: కరెటు బిల్లు చెల్లించినప్పుడు విద్యుత్‌ బిల్లు వసూలు చేసే ఉద్యోగి రశీదు ఇవ్వడం సాధారణమే. కానీ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన చౌహారీ దేవి అనే ఓ మహిళా కస్టమర్‌కు అందుకు భిన్నంగా బిల్లు వచ్చింది. ఆమె కుమారుడు రూ.4,950 బిల్లు చెల్లిస్తే.. బిల్లు తీసుకున్న ఉద్యోగి రసీదు మాత్రం రూ.197 కోట్లకు ఇచ్చాడు. బిల్లులో ఎంతకు ఇచ్చారో చూసుకోకుండా ఆమె కొడుకు బిల్లును తల్లికి తెచ్చిచ్చాడు. ఆమె కూడా గమనించకుండా ఆ బిల్లును దాచిపెట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ లక్నోలోని ఎలక్ట్రికల్‌ డిపార్టుమెంటుకు చెందిన కార్యాలయంలో లెక్కలు చూసేసరికి అధికారుల ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. వసూలైన నగదుకు, బిల్లులో ఉన్న మొత్తానికి కోట్లలో తేడా వచ్చింది. దాంతో ఎక్కడ పొరపాటు జరిగిందోనని పరిశీలించిన అధికారులు గోరఖ్‌పూర్‌లో చౌహారీ దేవి అనే కస్టమర్‌కు రూ.197 కోట్లకు రసీదు ఇచ్చినట్లు గుర్తించారు. దాంతో ఆ బిల్లును డిలీట్‌ చేసి, రూ.4,950కి కొత్త రసీదును జనరేట్‌ చేసి ఆమెకు పంపించారు. అయితే రూ.4,950 బిల్లుకు రూ.197 కోట్ల బిల్లు ఎందుకు ఇచ్చారంటే.. చౌహారీ దేవి పేరిట ఉన్న విద్యుత్‌ కనెక్షన్‌ నెంబర్ 197000తో మొదలవుతుంది. చౌహారి దేవి కొడుకు బిల్లు చెల్లించిన సమయంలో బిల్లు మొత్తాన్ని ఎంటర్‌ చేయాల్సిన దగ్గర బిల్లుకు బదులుగా ఆమె విద్యుత్‌ కనెక్షన్‌ నెంబర్‌ను ఎంటర్‌చేశారు. ఆ నెంబర్‌ మొత్తం రూ.197 కోట్లకుపైన ఉన్నది. అందుకే లెక్కల్లో రూ.197 కోట్ల తేడా వచ్చింది.

Spread the love