పిఎస్‌బిలకు రికార్డ్‌ లాభాలు

–  ప్రధాని మోడీ వెల్లడి
ముంబయి : ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు (పిఎస్‌బి) ఒకప్పుడు భారీ నష్టాలు, ఎన్‌పిఎల్లో ఉండగా.. ప్రస్తుతం రికార్డ్‌ లాభాలను నమోదు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యుపిఎ హయంలో స్కామ్‌లతో బ్యాంకింగ్‌ రంగాన్ని నాశనం చేశారన్నారు. ప్రస్తుతం బ్యాంక్‌లు ఆరోగ్యకరంగా మారాయన్నారు. వర్చువల్‌గా 70,000 మందికి పైగా నియామకాల లేఖలను అందించిన తర్వాత రోజ్‌గార్‌ మేళాను ఉద్దేశించి మోడీ మాట్లాడారు. తమ హయంలో పెద్ద సంఖ్యలో బ్యాంకింగ్‌ రంగంలో ఉపాధి పొందారన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ వెన్ను విరిచేలా గత ప్రభుత్వ హయాంలో బ్యాంకింగ్‌ కుంభకోణాలు జరిగాయన్నారు. కొంతమంది శక్తివంతమైన నాయకులు, కుటుంబాలకు ఇష్టమైన వారికి వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారన్నారు. ఆ రుణాలు ఎప్పటికీ తిరిగి చెల్లించబడవని అన్నారు. తమ ప్రభుత్వం, బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, చిన్న బ్యాంకులను విలీనం చేయడం తదితర చర్యలు చేపట్టిందన్నారు. ముద్ర పథకం కింద పేదలు, అసంఘటిత రంగాలకు రుణాల ద్వారా సహాయం చేయడానికి, మహిళా స్వయం సహాయక బృందాలకు మద్దతు ఇవ్వడానికి బ్యాంకింగ్‌ రంగ ఉద్యోగులు కష్టపడి, ప్రజలకు సేవ చేయడంలో నిబద్ధతతో పని చేస్తున్నారని అన్నారు.

Spread the love