ఎర్రజెండా హోరు

ఎర్రజెండా హోరు ఆ మూడు పార్టీలకు బుద్ధి చెప్పండి
– ఓట్ల కోసమే మహిళా రిజర్వేషన్‌ బిల్లు
– అసెంబ్లీ, పార్లమెంట్‌లో కమ్యూనిస్టులకు బలమివ్వండి
– కనకారెడ్డితోనే జనగామ నియోజకవర్గ అభివృద్ధి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ సుభాషిణి అలీ
– సీపీఐ(ఎం) జాతీయ నేతల ప్రచారం షురూ… 27 వరకు రాష్ట్రంలోనే…

– సంపదను అంబానీ, అదానీకి కట్టబెడుతున్న బీజేపీ
– క్రికెట్‌ చూసే మోడీకి మణిపూర్‌ వెళ్లే సమయం లేదా?
– ప్రభుత్వరంగ సంస్థలు ప్రయివేటుపరమైతే యువతకు ఉద్యోగాలెలా
సీపీఐ(ఎం) ప్రచార ఉధృతి పెంచింది. తమ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ జాతీయ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నెల 27 వరకు సీపీఐ(ఎం) అగ్ర నాయకత్వం రాష్ట్రంలోనే ఉండబోతుంది. ఆ పార్టీ పోటీ చేస్తున్న పలు నియోజకవర్గాల సభల్లో పాల్గొననుంది. ఖమ్మం, మధిరలోని ముదిగొండ సభల్లో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ శుక్రవారం పాల్గొన్నారు. వరంగల్‌ జిల్లా జనగామ, హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో జరిగిన సభల్లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణిఅలీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలకు జనం భారీ స్థాయిలో హాజరయ్యారు. శనివారం నుంచి సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌లు కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే బివి రాఘవులు, విజయ రాఘవన్‌ పలు సభలకు హాజరై సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. కేంద్ర నాయకత్వం రాకతో కార్యకర్తల ఉత్సాహం, ఎర్రజెండా ప్రచారం ఊపందుకున్నది.
నవతెలంగాణ-జనగామ
ప్రజా వ్యతిరేక పార్టీలు బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పి ప్రజా పక్షపాతి సీపీఐ(ఎం)ను ఆదరించాలని ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ సుభాషిణి అలీ కోరారు. జనగామ నియోజకవర్గ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకారెడ్డి గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం జనగామ జిల్లాలోని ప్రెస్టన్‌ గ్రౌండ్‌ నుంచి ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్కు మీదుగా ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ పక్కనున్న ధర్మ కొండల్‌రెడ్డి గ్రౌండ్‌ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిద్దిపేట జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు మరింత తీవ్రమయ్యాయని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయగా, రైతుల వ్యతిరేకతతో వాటిని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నదని తెలిపారు. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. మోడీ పాలనలో దేశ చరిత్రలో ఎప్పుడూలేని స్థాయికి నిరుద్యోగం, మహిళలపై దాడులు, కుల దురహంకార దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకోకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలు, వనరులను గుప్పిట్లో పెట్టుకుని నియంతృత్వం అమలు చేస్తూ వారి హక్కులను హరిస్తున్నదని తెలిపారు. ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలనూ అమలుచేయలేదని, సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. ఓట్ల కోసం మహిళా రిజర్వేషన్‌ బిల్లు తెచ్చారని, అమలు మాత్రం ఇప్పుడు జరగదని తేల్చి చెప్పేశారని అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేస్తున్నారన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లో కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. బీఅర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇసుమంత కూడా పని చేయకుండా సంక్షేమ పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు.
చదువుకున్న యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే నీతి నిజాయితీగా ప్రజల కోసం పని చేసే సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకారెడ్డిని అత్యధిక మెజారిటీతో ఆదరించాలని కోరారు. సభలో రాష్ట్ర నాయకులు పుప్పాల శ్రీకాంత్‌, కాసు మాధవి, అర్‌ఎల్‌ మూర్తి, హన్మకొండ జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి, జనగామ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య, రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, సింగారాపు రమేష్‌, రాపర్తి సోమయ్య, సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ళబండి శశిధర్‌, సత్తిరెడ్డి, జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్‌, జనగామ, సిద్దిపేట జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love