రెడ్‌ సెల్యూట్‌ కామ్రేడ్‌..

red-salute-comrade– కమ్యూనిస్టు యోధునికి కన్నీటి వీడ్కోలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బుద్ధదేవ్‌ భట్టాచార్యకు అశేష ప్రజానీకం అశ్రునివాళులర్పించారు. పార్టీ కార్యాలయం నుంచి ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రి వరకూ ఆయన భౌతికకాయం వెంట భారీగా తరలివచ్చారు. ‘రెడ్‌ సెల్యూట్‌ కామ్రేడ్‌ బుద్ధదేవ్‌’ అంటూ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బుద్ధదేవ్‌ భౌతికకాయాన్ని పరిశోధన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌కు అప్పగించారు. సీపీఐ(ఎం) ఎర్ర జెండాతో కప్పివున్న బుద్ధదేవ్‌ భౌతికకాయాన్ని గురువారం దక్షిణ కోల్‌కతాలోని పామ్‌ అవెన్యూలో ఆయన ఉండే రెండు గదుల నివాసం నుంచి మార్చురీ పీస్‌ వరల్డ్‌కు తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఆయన పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌, ప్రకాశ్‌ కరత్‌, బృందాకరత్‌, ఎంఎ బేబీ, నీలోత్పల్‌ బసు, రామచంద్రడోమ్‌, రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డి సలీమ్‌, సీనియర్‌ నాయకులు హన్నన్‌మొల్లా తదితరులు నివాళులర్పించారు. పూలమాలలు, ఎర్ర గులాబీలతో అనేక మంది కార్యకర్తలు తరలివచ్చారు. అంతిమ యాత్రలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సహా అశేష జన వాహిని కదిలింది. భట్టాచార్య భార్య మీరా కన్నీళ్లతో పార్టీ నాయకులు, వందలాది మంది అభిమానులతో పాటు రాజకీయ శ్రేణులు, సాధారణ ప్రజలతో పాటు అంతిమ యాత్రలో నడిచారు. ఆయన భౌతికకా యాన్ని కడసారి చూసేందుకు రహదారుల నిండా జనం బారులు తీరారు.
ఆయనెప్పుడూ ఆడంబరాలు కోరుకోలేదు: గన్‌సెల్యూట్‌ను తిరస్కరించిన బుద్ధదేవ్‌ కుటుంబం
బుద్ధదేవ్‌ భట్టాచార్య భౌతికకాయానికి గన్‌ సెల్యూట్‌ చేసేవిధంగా ఏర్పాట్లు చేయాలన్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదనను ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బుద్ధదేవ్‌ భట్టాచార్య ఎన్నడూ ఆడంబరాలను కోరుకోలేదని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీమ్‌ మాట్లాడుతూ బుద్ధదేవ్‌ చివరి శ్వాస విడిచే వరకూ అత్యంత సాధారణ జీవితాన్నే కోరుకున్నారని, రెండు గదుల ఫ్లాట్‌లోనే నివసించారని చెప్పారు.

Spread the love