హజ్‌ యాత్రికుల వయోపరిమితి తగ్గింపు

హజ్‌ యాత్రికుల వయోపరిమితి తగ్గింపు– 70 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు కుదించిన కేంద్రం
– ప్రభుత్వ వైద్యుడి అనుమతి తప్పనిసరి
న్యూఢిల్లీ: 2025 హజ్‌ పాలసీలో మోడీ ప్రభుత్వం వయోపరిమితిని తగ్గించింది. దీనిని 70 సంవత్సరాల నుంచి 65 ఏండ్లకు సడలించింది. ఈ చర్య వేలాది మంది వృద్ధాప్య యాత్రికులకు ప్రయోజనం చేకూరుస్తుందనీ, హజ్‌ యాత్రలో భాగంగా 65 ఏండ్ల, అంత కంటే ఎక్కువ వయస్సున్నవారికి ప్రాధాన్యత లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కొత్త పాలసీ ప్రకారం సహచరుడి వయస్సు 18 నుంచి 60 ఏండ్ల మధ్య ఉండాలి. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు గత నెలలో 2025 హజ్‌ విధానాన్ని సమీక్షించారు. ఆ తర్వాత ఈ మార్పు వచ్చింది. వచ్చే ఏడాది రిజిస్ట్రేషన్‌ సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం కానున్నదని తెలుస్తున్నది. యాత్రికులకు సహాయం చేయటానికి, వసతి, విమానం, అత్యవసర హెల్ప్‌లైన్‌ గురించి సమాచారాన్ని అందించటానికి ప్రత్యేక ‘హజ్‌ సువిధ’ యాప్‌ ప్రారంభించబడింది. కొత్త విధానం ప్రకారం.. యాత్రికులు ప్రభుత్వ వైద్యుడి నుంచి మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ పొందవలసి ఉంటుంది. గతేడాది పాలసీ ప్రకారం రిజిస్టర్డ్‌ డాక్టర్‌ నుంచి మెడికల్‌ సర్టిఫికేట్‌ పొందాల్సి ఉండేది.

Spread the love