”ఎంతైనా ఈ దేశానికి దిశా నిర్దేశం చేయగలదమ్మున్న లీడర్ మా పెద్దాయన ఒక్కడే. ఆయనకు ఆయనే సాటి!” అన్నాడు పుష్పరాజ్.
”మీ పెద్దాయన కొత్తగా ఏం చేశాడు?” ఆశ్చర్యంగా అడిగాడు కనకరాజ్.
”మా పెద్దాయన కొత్తగా ఏమీ చేయలేదు అనుకుంటున్నావా? ఇప్పటికి చేసినవే ఎన్నో ఉన్నాయి! వాటిని అమలు చేయటమే మన బాధ్యత! ఒక నేషనల్ హైవేనే వేశాడు. ఆ మార్గంలో పయనించటమే మనం చేయాల్సిన పని!” అన్నాడు పుష్పరాజ్.
”ముందు ఆ ఘనకార్యం ఏమిటో చెప్పవయ్యా!” విసుగ్గా అన్నాడు కనకరాజ్.
”బాధితుల కాళ్ళు కడగటం అనే గొప్ప సంప్రదాయాన్ని మనకు పరిచయం చేసింది పెద్దాయనే కదా!” ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మున్సిపల్ కార్మికుల కాళ్ళు కడిగి ఒక మహౌన్నత సంప్రదాయాన్ని నెలకొల్పాడు కదా!” అన్నాడు పుష్పరాజ్ గర్వంగా.
”ఆ ఘనకార్యం ఎప్పుడో ముగిసింది కదా! మళ్ళీ ఇప్పుడు ఎందుకు తవ్వుకుని వచ్చావు!” అన్నాడు చిరాగ్గా కనకరాజ్.
”ఎందుకంటే ఆ మహౌన్నత సంప్రదాయాన్ని మా పార్టీకి చెందిన మరో నాయకుడు కొనసాగిస్తున్నాడు. మూత్రం పోయబడిన గిరిజనుడిని తన స్వగృహానికి పిలిచి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కాళ్ళు కడిగిన శివరాజ్‌సింగ్ చౌహాన్‌ది ఎంత విశాల హృదయమై ఉండాలో ఆలోచించావా?” తన్మయత్వంతో అడిగాడు పుష్పరాజ్.
”మొన్న ఆ గిరిజనుడిపై మూత్రం పోసింది మీ పార్టీ లీడరే కదా! ఆ విషయం చెప్పకుండా కాళ్ళు కడిగిన సంగతే చెబుతావేం?” అన్నాడు కనకరాజ్.
”మూత్రం పోసినవాడి సంగతి కాసేపు పక్కనపెట్టు! ఆ సంఘటన జరగకపోతే ఆ గిరిజనుడి గురించి ఎవరికైనా తెలిసేదేనా? వాడి జీవితానికి ఎప్పుడైనా ముఖ్యమంత్రి చేత కాళ్ళు కడిగించుకునే భాగ్యం పట్టేదేనా. ముఖ్యమంత్రే చెప్పినట్లు ఆ గిరిజనుడు సుధాముడంతటి వాడు అయ్యాడు తెలుసా?” గొప్పగా అన్నాడు పుష్పరాజ్.
”అంటే కాళ్ళు కడిగిన వాడు కృష్ణుడా?” అడిగాడు కనకరాజ్.
”అందుకు సందేహమా?” తిరిగి అడిగాడు పుష్పరాజ్.
”ఇంతకూ చెప్పదలుచుకున్నదేమిటీ సూటిగా చెప్పు” అడిగాడు కనకరాజ్.
”ఆ సంఘటన జరగటం ఆ గిరిజనుడి ఆదృష్టం అంటున్నాను!” పుష్పరాజ్ సమాధానమిచ్చాడు.
”అంటే దుర్మార్గం చేసిన వాడిని సమర్థిస్తున్నావా? పదే పదే గిరిజనుడిని అదృష్టవంతుడని అంటున్నావు!” ఆశ్చర్యంగా అడిగాడు కనకరాజ్.
”దుర్మార్గం చేసిన వాడి ఇల్లు బుల్డోజర్‌తో కూలగొట్టించాము. గిరిజనుడి కాళ్ళు స్వయంగా ముఖ్యమంత్రే కడిగాడు. ఇంకేమి కావాలి?” అన్నాడు కనకరాజ్.
”చేసిన గొప్పపని కూడా చెప్పుకోరాదా? మీరింతే ఈ దేశానికి పట్టిన చీడపురుగులు!” అన్నాడు పుష్పరాజ్.
”చీడ పురుగులు ఎవరో తెలుస్తూనే ఉంది. సాటి మనిసిని గౌరవించలేని సంస్కారం మీది. గిరిజనుడన్న చిన్నచూపే ఆ పని చేయించింది. అదే పని అగ్రవర్ణాల వారు రేప్ చేసినా శిక్షించరాదన్న మనువాదం నిండిన మనుషులు మీరు! తప్పు చేయటం మీ వంతే, దాన్ని సమర్థించుకోవటమూ మీ వంతే! ఇదేనా మీ గొప్ప సంప్రదాయం!” తీవ్రంగా ప్రశ్నించాడు కనకరాజ్.
”చేసిన తప్పుకు పశ్చాత్తాపంగానే కాళ్ళు కడిగాము కదా!” అన్నాడు పుష్పరాజ్.
”మీరు చేసిన తప్పు కాళ్ళు కడిగితే పోయేటంత చిన్నది కాదు! మనుషుల మెదళ్ళను ఖరాబు చేశారు! అంతరాలు మానవ నిర్మితాలేనని ఎందరో పెద్దలు చెప్పారు. కాని ఆ తారతమ్యాలు స్మృతిబద్దమని, నిచ్చెన మెట్ల వ్యవస్థే ఈ సమాజపు అసలు రూపమంటూ మీరు కొన్ని శతాబ్దాలుగా చేసిన ప్రచారం ఈ దేశ ప్రజల మెదళ్ళను కలుషితం చేసింది. హరిజనులు, గిరిజనులు హీనజాతి వారని, వారిపై ఏ అఘాయిత్యం చేసినా చెల్లుబాటయ్యే విధంగా సిద్ధాంతాలు నూరిపోస్తున్నది మీ పార్టీయే, అందుకే సమాజంలో మీరు బలపడుతున్న కొద్దీ, ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయి!” అన్నాడు కనకరాజ్.
”ఇంత చెబుతున్నావు! బుల్డోజర్‌తో వాడి ఇల్లు కూలగొట్టి శిక్షించిన సంగతి మాట్లాడవే?” రోషంగా ప్రశ్నించాడు పుష్పరాజ్.
”ఇల్లు కూలగొట్టడం అంటే వాడిని శిక్షించటమా? మరి ఉన్న మాటలేనా. నా కొడుకు తప్పుచేస్తే వాడికి ఉరిశిక్ష వేయండి! కాని నా కష్టార్జితంతో కట్టుకున్న నా ఇల్లు కూల్చితే నెనెక్కడుండాలి! అని ఆ తండ్రి పడ్డగోస మీకు అర్థం కాలేదా? గాయం ఒక చోట ఉంటే మందు మరోచోట రాస్తారా?” అన్నాడు కనకరాజ్.
”వాడి మీద పోలీస్ కేసు పెట్టాం కదా!” అన్నాడు పుష్పరాజ్.
”పోలీస్ కేసు పెట్టారు సరే! ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారా? అంత దుర్మార్గపు ఆలోచనకు కారణమైన భావజాలం, వాట్సప్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెదజల్లుతున్న మీపై ఎవరు కేసులు పెట్టాలి? మీరే అధికారం వెలగబెడుతున్నారు కదా? ఆ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న మీకు ఆ అర్హత ఉందా? మీ మనువాద భావజాలంతో ఈ దేశంలో మనుషులంతా సమానమే అన్న ఆలోచన చచ్చిపోయింది! మీకు నిజంగా పశ్చాత్తాపడే గుణమే ఉంటే, మీరు వెదజల్లుతున్న భావజాలమే ఈ దుశ్చర్యలన్నింటికీ ఏకైక కారణం! అందుకు సిగ్గుపడండి!” అన్నాడు కనకరాజ్.
పుష్పరాజ్ నిజమైన పశ్చాత్తాపంతో తలదించుకున్నాడు.
– ఉషాకిరణ్.