బీఆర్ఎస్ ‘స్వేదపత్రం’ విడుదల..

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘స్వేదపత్రం విడుదల చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చివరకి వాయిదా వేసుకొని పోయారు. బాధ్యతగల పార్టీగా ‘స్వేద పత్రం’ విడుదల చేస్తున్నాం. కోట్ల మంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ఈ స్వేదపత్రం. కొత్తరాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం నుంచి సమృద్ధివైపు తెలంగాణ అడుగులు వేసింది. రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష నెలకొంది. ఎన్నో పోరాటాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైంది. ఇప్పుడు కొందరు నేతలు తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారు. ఉద్యమంలో ఆనాడు విరిగిన లాఠీలకు లెక్కలేదు. పేలిన బుల్లెట్లకు లెక్కలేదు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది’’ అని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని కేటీఆర్‌ తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. రాష్ట్ర స్థూల రుణం రూ.3.17 లక్షల కోట్లు కాగా.. దీన్ని కాంగ్రెస్‌ నేతలు రూ.6.70 లక్షల కోట్లుగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

Spread the love