నవతెలంగాణ-నిజామాబాద్ డెస్క్
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాల కోసం బుధవారం నుంచి నీటిని విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాసరావు గుప్త ఆదివారం తెలిపారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో, ఎగువ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి క్రమంగా వరద నీరు వచ్చి చేరుతుందని, దాంతో నీటి సామర్థ్యం పెరుగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి పరిసర ఎగువ ప్రాంతాల నుంచి 21,422 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పారు. కాగా తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశ నిర్ణయం ప్రకారం ఆగస్టు 7 (బుధవారం) నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని పంటలకు కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువలకు సాగునీరు విడుదల చేయనున్నట్టు తెలిపారు. వానాకాలం పంటలు వేయని రైతులు పంటలు వేయటానికి అన్నిరకాల సిద్ధం చేసుకోవాలని సూచించారు. నీటి విడుదల సమాచారంతో రైతులు ఆనందర వ్యక్తంచేస్తున్నారు.