టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

TSPSCనవతెలంగాణ-హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక ‘కీ’ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ‘కీ’పై ఈనెల 17 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ‘‘ప్రాథమిక కీ, మాస్టర్‌ ప్రశ్నపత్రం అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో ఈనెల 13 నుంచి 17 వరకు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు ప్రాథమిక కీ కోసం తమ వివరాలను నమోదు చేయాలి. ప్రాథమిక కీపైన అభ్యంతరాలను ఈనెల 17 సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలి. మొదట కమిషన్‌ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్‌ ద్వారా వ్యక్తిగత వివరాలను ధ్రువీకరించి, అభ్యంతరాలను ఆంగ్లంలో నమోదు చేయాలి. వాటికి తగిన రుజువులు, పుస్తక రచయిత పేరు, పుస్తకంలో పేజీ నంబరు… పత్రిక ఎడిషన్, పేజీ నంబరు, పబ్లిషర్‌ పేరు… వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ వివరాలను ఇవ్వాలి. ఈ-మెయిల్, వ్యక్తిగత విజ్ఞాపనలు, ఇతర పద్ధతుల్లో వచ్చే, గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోం’’ అని కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్ష షెడ్యూలును తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు జరుగుతాయంది.

Spread the love