– రెచ్చగొడుతూ అధికారంలోకి రావాలని బీజేపీ యత్నం
– వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించాలి : సెమినార్‌లో హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ పిలుపు
నవతెలంగాణ-కంఠేశ్వర్
‘ఓట్ల కోసం మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. మల్లు స్వరా జ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి, మల్లుస్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమితి కన్వీనర్ డా. రవీంద్రనాథ్ సూరి అధ్యక్షతన ‘రాజ్యాంగానికి ప్ర మాద ఘంటికలు’ అంశంపై నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బుధవా రం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలను అస్థిరపరుస్తూ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణలో పొందుపరిచిన లౌకిక, సోషలిస్ట్ భావాలను భారత రాజ్యాంగం నుంచి తొలగించడమే కాకుండా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన ఈ భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని మాట్లాడటం హాస్యస్పదమని అన్నారు. దేశాన్ని ఐక్యంగా కాపాడాల్సిన నాయకత్వాన్ని ప్రజలందరూ ఎన్నుకోవాల ని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశం మత ఉన్మాదంపై ఆధారప డింది కాదని, లౌకిక, ప్రాథమిక హక్కులే దేశానికి మూల స్తంభాలని స్పష్టంచేశారు. అదేవిధంగా మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్, ఈడీ, సీబీఐ తదితర రాజ్యాంగ సంస్థలను సైతం తన గుప్పిట్లోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడమే కాక, ప్రతిపక్ష పార్టీలను అణిచివేసి మరొకసారి రాజ్యాధికారాన్ని అందుకోవాలని ఆశిస్తున్నదని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు ప్రజలందిస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని మాట్లాడటంలోని ఆంతర్యం ఏముందో ప్రజలందరూ గమనించాలని తెలిపారు. అత్యధిక ఎలక్టోరల్ బాండ్లలో బీజేపీకి కార్పొరేట్ సంస్థలు ఎక్కువ డబ్బులు అందించాయని ప్రజలకు తెలియకుండా మభ్యపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలపై దాడులు చేయడం సరికాదని అన్నారు. బీజేపీ పదేండ్ల పాలనలో విద్యా వైద్యాన్ని గాలికి వదిలేసిందని తెలిపారు. దేశంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే మణిపూర్‌లా దేశాన్నీ అగ్నిగుండంగా మారు స్తారని అన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ పద్మజా షా మాట్లాడుతూ.. ప్రపంచపు ఆహార సూచికలో, పర్ క్యాపిటల్ సూచికలో మన దేశం పక్క దేశాల కన్నా వెనుకంజలో ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, పేదరికంతో దీనస్థితిలో మగ్గిపోయినా.. మోడీ ప్రభుత్వం మాత్రం ఈ దేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతుందని మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ మాట్లాడుతూ.. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని, హిందూ ముస్లింల మధ్య చిచ్చులు పెట్టడం వెన్నతో పెట్టిన విద్యగా మారిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఓడించి లౌకికతత్వ పార్టీలను గెలిపిం చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో షేక్ హుస్సేన్, కే రామ్మోహన్‌రావు, నర్రా రామారావు, గైని గంగారం, పాస్టర్ ఆనంద్, శ్రీధర్, శంతన్, ఈవీఎల్ నారాయణ, ప్రసాద్ రావు, తదితరులు పాల్గొన్నారు.