నవతెలంగాణ – వాషింగ్టన్ : పలువురు మైనర్లతో సహా అనేకమంది మహిళలను ఆధ్యాత్మిక భార్యలుగా పేర్కొంటూ శామ్యూల్ బాటెమ్యాన్ అనే ఓ మత గురువు వారిపై లైంగిక నేరాలకు పాల్పడ్డాడు. తన లైంగిక వాంఛను తీర్చుకునేందుకు వివిధ దేశాల నుంచి బాలికలను అక్రమ రవాణా చేశాడు. ఈ నేరాలను మత నాయకుడు స్వయంగా ఒప్పుకోవడంతో న్యాయస్థానం ఆయనకు 50 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఫండమెంటలిస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్ అనేది ఒక ఫండమెంటలిస్ట్ గ్రూప్. ఇందులోని గ్రూప్ సభ్యులు మహిళలను ఆధ్యాత్మిక భార్యలుగా పేర్కొంటూ లైంగిక నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో శామ్యూల్ బాటెమ్యాన్ తనని తాను ఎఫ్‌ఎల్‌డీఎస్ ప్రవక్తగా ప్రకటించుకున్నారు. తన అనుచరులతో పలువురు మహిళలను రప్పించుకొని వారిని తన భార్యలుగా ప్రకటించుకునేవాడు. అయితే, ఇవేవీ చట్టబద్దమైనవి కావు. ఈనేపథ్యంలోనే 2022లో పోలీసులు శామ్యూల్‌ని అరెస్టు చేశారు. నిందితుడి నివాసంతో సహా వివిధ ప్రాంతాల నుంచి 11 నుంచి 14 ఏళ్ల వయసున్న అనేకమంది బాలికలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ దేశాల మీదుగా బాలికలను అక్రమంగా రవాణా చేసినట్లు నిందితుడు విచారణలో స్వయంగా ఒప్పుకున్నారు. వారిలో కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్లు కూడా తెలిపారు.