బుర్ఖాలు తొలగించి.. ముస్లిం ఓటర్ల ఐడీ తనిఖీ

Remove burkhas.. Muslim Voter ID Check– హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు
– నిజామాబాద్‌లోనూ అరవింద్‌ దుందుడుకు చర్యలు
– మహిళా ఓటర్లపై బీజేపీ నేతల దురుసు
నవతెలంగాణ-సిటీబ్యూరో/ మలక్‌పేట్‌/నిజామాబాద్‌
పోలింగ్‌ సందర్భంగా మహిళా ఓటర్ల పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. బీజేపీ హైదరాబాద్‌ అభ్యర్థి మాధవీలత సోమవారం ఓ పోలింగ్‌ బూత్‌లో పలువురు ముస్లిం మహిళల బురఖాలను తొలగించాలని కోరి వారి ఓటర్‌ ఐడీలను వెరిఫికేషన్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో అది వివాదాస్పదమైంది. ఈ మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌ పాతబస్తీలోని అజాంపూరలో పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 122కు వచ్చిన మాధవీలత అక్కడ కూర్చున్న ముస్లిం మహిళా ఓటర్ల బుర్ఖాలు తొలగించి వారి ఐడీలను పరిశీలించారు. ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరలైంది. కాగా మాధవీలతపై ఏఐఏంఐఏం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌.. మాధవీలతపై కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఐపీసీ సెక్షన్లతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై మలక్‌పేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మాధవీలత మాట్లాడుతూ.. తాను ఒక అభ్యర్థిని అని చట్ట ప్రకారం ఫేస్‌మాస్క్‌లు లేకుండా ఐడీ కార్డుల వెరిఫికేషన్‌ చేసే హక్కు అభ్యర్థులకు ఉంటుందన్నారు. వాస్తవానికి ఆ హక్కు పోలింగ్‌ బూత్‌ ఆఫీసర్లదే. నిజామాబాద్‌ జిల్లాలో ముస్లిం మహిళా ఓటర్లు బుర్ఖా ధరించి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి అభ్యంతరం తెలిపారు. అసలు ఓటు వేయడానికి ఎవరు వచ్చారు..? ఎలా గుర్తిస్తారు..? అని ముస్లిం మహిళా ఓటర్లను ఉద్దేశించి ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌పై అరవింద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఏం డ్యూటీ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల అధికారులు అభ్యంతరం తెలిపారు.

Spread the love