
– గ్రామాభివృద్ధికి స్థలం కేటాయించాలని తహసిల్దారుకు వినతిపత్రమందజేత
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ప్రభుత్వాధికారులు తొలగించడం హర్షనీయమని పలువురు గూడెం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసిల్ వద్ద తహసిల్దార్ ఎర్రోల్ల శ్యామ్ కు పలువురు గూడెం గ్రామస్తులు వినతిపత్రమందజేశారు. గూడెం గ్రామ శివారులోని 321 సర్వే నంబర్ యందు అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు ప్రభుత్వ అభివృద్ధి పనులకు, ఆర్హులైన నిరుపేదల ఇళ్ల నిర్మాణాలకు స్థలం కేటాయించాలని తహసిల్దారుకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుల వినతులను నివేదిక రూపొందించి జిల్లా పరిపాలనాధికారికి అందజేస్తానని..గ్రామంలో నిలిచిన ప్రభుత్వ అభివృద్ధి పనుల జాభితాను గ్రామ ప్రత్యేకాధికారికి అందజేయాలని తహసిల్దార్ శ్యామ్ గ్రామస్తులకు సూచించారు.
ఆర్హులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి : గతంలో గ్రామంలో పలువురికి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించింది. అ కేటాయింపులను కొందరు ఆసరగా చేసుకుని అదనంగా ప్రభుత్వ భూమిని అక్రమించి పశువుల, గొర్రెల పాకలను అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వాధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించడం హర్షనీయం.గ్రామంలో ఇళ్లులేని పలువురు నిరుపేదలున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి అక్రమాలకు తావులేకుండా మరికొందరికి ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని పారదర్శకంగా కేటాయించాలి.