ఇంజినీరింగ్‌ సీట్లపై పరిమితి ఎత్తివేత

ఇంజినీరింగ్‌ సీట్లపై పరిమితి ఎత్తివేత– అదీ ప్రముఖ కళాశాలల్లోనే…
– ఏఐసీటీఈ యోచన
చెన్నయ్ : దేశంలో పేరెన్నికగన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కీలక బ్రాంచీల్లో సీట్ల సంఖ్యపై ప్రస్తుతం అమలులో ఉన్న పరిమితిని వచ్చే సంవత్సరం నుండి తొలగించాలని అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా, స్థూల నమోదు నిష్పత్తిని (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) పెంచేందుకు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది లభ్యత ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచుతారు. సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేయడానికి ముందు నిపుణుల కమిటీ ఆయా కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తుంది. ఏఐసీటీఈ ప్రతిపాదనను ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీలు స్వాగతించగా మధ్య శ్రేణి కాలేజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రవేశాలు తగ్గిపోతే నాణ్యమైన విద్యను అందించడం కష్టమవుతుందని చెబుతున్నాయి. మధ్య శ్రేణి కాలేజీల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ప్రముఖ కళాశాలలకు లబ్ది చేకూర్చడమే దీని వెనుక ఉన్న ఉద్దేశమని విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం కాలేజీల్లో ఒక్కో బ్రాంచిలో గరిష్టంగా 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. డిమాండ్‌, అందుబాటులో ఉన్న సీట్ల మధ్య వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో గతంలో గరిష్ట పరిమితిని ప్రవేశపెట్టారు. ఇప్పుడు దానిని తొలగించాలని యోచిస్తున్నారు. కోర్‌ బ్రాంచీల్లో కనీసం మూడు కోర్సులు ఉన్న కాలేజీలకే సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు అనుమతి లభిస్తుంది. నాణ్యమైన విద్యను అందిస్తున్న కాలేజీలకు మాత్రమే సీట్లను పెంచుకొని, క్యాంపస్‌లను విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుందని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల యజమాని తెలిపారు. అమెరికాలో సగటు విద్యార్థుల సంఖ్య 30 వేల నుండి 40 వేల వరకూ ఉంటుందని గుర్తు చేశారు. దీనితో పోలిస్తే మన దేశంలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే నాణ్యమైన విద్యను అందిస్తున్న మధ్య శ్రేణి కళాశాలల్లో ప్రవేశాలు తగ్గుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తుది అనుమతికి సంబంధించిన ప్రాసెస్‌ హ్యాండ్‌బుక్‌ కోసం ఎదురు చూస్తున్నాం. అయితే ఈ ప్రతిపాదిత చర్య ప్రముఖ కళాశాలలు, మధ్య శ్రేణి కళాశాలల మధ్య దూరం పెంచుతుంది. ప్రవేశాలు తగ్గితే నాణ్యమైన విద్యను అందించడం కష్టమవుతుంది’ అని ఓ కాలేజీ ఉపాధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love